ప్రభుత్వ ఆంక్షలు ధిక్కరించిన ఉద్యోగులతో క్రిక్కిరిసి విజయవాడ

ఎపి ప్రభుత్వం తీసుకొచ్చిన పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు చేపట్టిన ‘ ఛలో విజయవాడ’ పోలీస్ నిర్బంధాలు, ప్రభుత్వ ఆంక్షలను అదిగమించి విజయవంతమైనది. ఎన్ని నిర్బంధాలకు పాల్పడినా, ఎక్కడికక్కడ కదలకుండా చేసే ప్రయత్నం చేసినా, ఇళ్లకు వెళ్లి మరీ బెదిరింపులకు పాల్పడినా ఖాతరు చేయకుండా వేల సంఖ్యలో ఉద్యోగులు చేరుకోవడం రాష్ట్ర ప్రభుత్వాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. 
 
పిల్లలకే కాదు… పాఠాలు చెప్పమంటే ప్రభుత్వానికి కూడా చెబుతామంటూ ఉపాధ్యాయులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బిఆర్‌టీఎస్‌ రోడ్డులోకి అనుమతించకపోవడంతో రహదారిపైనే బైఠాయించి నిరసన తెలిపారు.  ‘మేమూ మీ అక్కాచెల్లెళ్లమే’ అంటూ మహిళా ఉద్యోగులు నినాదాలు చేశారు. ‘సిఎం గారు… మా గోడు వినాలంటూ’ పాటల ద్వారా మహిళా ఉద్యోగులు నిరసన తెలిపారు. బిఆర్‌టీఎస్‌ వద్దకు 13 జిల్లాల నుంచి వేలాదిగా ఉద్యోగులు చేరుకుంటున్నారు. 
 
 విజయవాడలో రహదారులన్నీ బీఆర్‌టీఎస్ రోడ్ల వైపే.. ఒక్కసారిగా ఉద్యోగులు ఉప్పెనలా తరలిరావడంతో పోలీసులు సైతం చేతులెత్తేశారు. బీఆర్‌టీఎస్ మీసాల రాజేశ్వరరావు వంతెన వద్ద నుంచి పీఆర్సీ సాధన సమితి ర్యాలీ ప్రారంభమైంది. ర్యాలీకి అగ్రభాగాన పీఆర్సీ సమితి ముఖ్య నేతలు నిలిచారు.
 
ఎక్కడికక్కడ బారికేడ్లు ఛేదించుకుని మరీ ఉద్యోగులు దూసుకెళ్లారు. విజయవాడ నగరం వెలుపలే వేలాది మంది ఉద్యోగులను పోలీసులు నిలిపివేసినా విజయవాడలో ఉద్యోగులు ఇసుకేస్తే రాలనంతగా తరలి వచ్చారు.   జిల్లాల్లో పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ భారీ సంఖ్యలో ఉద్యోగులు విజయవాడకు తరలివచ్చారు. రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు విజయవాడలో భారీ ప్రదర్శన న్విహించారు.
 
అడ్డంకులు ఎన్ని ఉన్నా ఉద్యోగులు తరలి వచ్చారని చెబుతూ ఈ నెల 5 నుంచి పూర్తిగా సహాయ నిరాకరణ చేస్తామని, .. 6వ తేదీ అర్థరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తు న్నామని  పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.  డిమాండ్లు నెరవేర్చే వరకూ తమ ఉద్యమం ఆగబోదని హెచ్చరించారు. 

” ప్రభుత్వం ఇలాంటి పీఆర్సీని ప్రకటించడం ఒక చరిత్ర.. ఉద్యోగుల ఉద్యమం కూడా ఒక చరిత్రే. ఈనెల 5 నుంచి సహాయ నిరాకరణ చేపడతాం. ఉద్యోగుల సమ్మెతో ప్రజలకు అసౌకర్యం కలిగితే ఆ భాధ్యత ప్రభుత్వానిదే. ఉద్యోగుల ఉద్యమమంటే ఏంటో ఈ ప్రభుత్వానికి తెలియాలి. మా వెనుక లక్షలాదిగా ఉద్యోగులున్నారు . ప్రభుత్వానికి ఇప్పటికైనా కనువిప్పు కలగాలి”. అని బొప్పరాజు హితవు చెప్పారు. 

ప్రభుత్వాధినేతగా సీఎం జగన్‌ ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించాలని పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పీఆర్సీ అంశంలో జగన్‌ నేరుగా ఉద్యోగులతో చర్చించి న్యాయం చేయాలని కోరారు. తాము శాంతియుతంగా అందోళనలు చేస్తున్నామని .. సీఎం జోక్యం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఒప్పంద , పొరుగు సేవల సిబ్బంది వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు.
 
ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకుని వితండ వాదాన్ని విడనాడి మాయలెక్కల నుంచి బయటకు రావాలని.. వాస్తవాలను అంగీకరించాలని  ఎపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్య నారాయణ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. పీఆర్సీ జీవోల వెనక్కి తీసుకునే వరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మొహం చూడొద్దని ఉద్యోగులు చెప్పారని ఆయన పేర్కొన్నారు. హెచ్‌ఆర్‌ఎ పాత శ్లాబులు యథాతధంగా కొనసాగించాలని  డిమాండ్‌ చేశారు.
 
సీపీఎస్‌ రద్దు చేయాలని.. పొరుగు సేవల సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని పీఆర్సీ సాధన సమితి నేత వెంట్రామిరెడ్డి కోరారు.  ఒప్పంద ఉద్యోగుల సర్వీసులు క్రమబద్దీకరించాలని చెప్పారు. 
 
కాగా, పీఆర్సీ సాధన సమితి నేతల పిలుపు మేరకు ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైందని, ఉద్యోగుల మహాప్రభంజనం కనిపిస్తోందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ” పోలీసులు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలని జగన్‌ అన్నారు.. మరి ఇప్పుడు పోలీసులు ఎక్కడున్నారు?” అంటూ ఆయన ఎద్దేవా చేశారు.  ఉద్యోగులు పర్మినెంట్ అని, మనం ఉండేది ఐదేళ్లేనని జగన్ కు హితవు చెప్పారు.