పార్లమెంటులో టీఆర్ఎస్ నేతల తీరుపై ఆగ్రహం

పార్లమెంటు సమావేశాలలో రాష్ట్రపతి ప్రసంగం సందర్భంగా టీఆర్ఎస్ నేతల తీరుపైఎంపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీకి చెందిన ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. 
 
ప్రజాస్వామ్యంపై నమ్మకంలేని   టీఆర్ఎస్  నాయకులు నాడు గవర్నర్ ను అవమానించారని, నేడు రాష్ట్రపతిని కూడా అవమానించారని విమర్శించారు. గవర్నర్ ప్రసంగంలో తమ సంవత్సరకాలపు అభివృద్ధి గురించి చెబుతారా? లేక ప్రతి పక్షాల గురించి చెబుతారా? అని అధికార టీఆర్ఎస్ ను ప్రశ్నించారు.
ఈ కనీస జ్ఞానం లేని సీఎం కేసీఆర్ రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలంటూ వారి ఎంపీలను ఆదేశించడం నియంతృత్వ ఆలోచనలకు నిదర్శనం అని సంజయ్ విమర్శించారు. గవర్నర్ ప్రసంగాన్ని,  రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడంతో తెలంగాణకు కలిగే కొత్త ప్రయోజనం ఏమీ ఉండదన్న విషయాన్ని కేసీఆర్ గుర్తించాలని బండి సంజయ్ హితవు చెప్పారు.

రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ  నాయకత్వంలో గత సంవత్సర కాలంగా జరిగిన అభివృద్ధిని, కేంద్ర ప్రభుత్వ విజయాలను స్పష్టంగా వివరించారని తెలిపారు. తెలంగాణ ప్రజల పరిస్థితి దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. 

టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రజలకు అందించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే తెలంగాణ ప్రజల పక్షాన బీజేపీ పోరాటం ఆగదు అని స్పష్టం చేశారు.

మండిపడ్డ డా. లక్ష్మణ్ 

కాగా,  రాష్ట్రపతి ప్రసంగాన్ని టీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరించటం వలన తెలంగాణకు ప్రయోజనం ఏంటని బిజెపి ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ ప్రశ్నించారు. కేసీఆర్‌కు రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదని,  రాచరిక వ్యవస్థకు కేసీఆర్ అలవాటు పడ్డాడని ఆయన ఆరోపించారు. కేసీఆర్ హామీల అమలు కోసం  ప్రజలు ఆందోళనకు సిద‌్ధమవుతున్నారని ఆయన పేర్కొన్నారు. 

అమెరికా, యూరప్ దేశాలకు సాధ్యంకాని స్వదేశీ కంపెనీతో వ్యాక్సిన్ తయారు చేసిన ఘనత మోదీదేనని ఆయన కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్లను‌‌ దేశవ్యాప్తంగా రైతులకు పెట్టుబడి సాయం చేస్తోందని తెలిపారు. తెలంగాణ మంత్రులు బావిలో కప్పలని ఆయన పోల్చారు. 

మిషన్ భగీరథను అవినీతికి కేరాఫ్‌గా మార్చుకున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ వలనే ఆయష్మాన్ భారత్ తెలంగాణలో అమలు కావటం‌ లేదని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా సొంతంగా స్టీల్ ఫ్యాక్టరీ పెట్టుకుందామన్న కేటీఆర్ ఎక్కడ అని ఆయన ఎద్దేవా చేశారు. బయ్యారంపై కేసీఆర్, కేటీఆర్‌లు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.