పూర్తిగా తప్పుల తడకగా ధరణి పోర్టల్

ధరణి పోర్టల్‌ పూర్తిగా తప్పుల తడకగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. భూ యజమానుల పేర్లు, ఫొటోలను తప్పుగా చూపుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ తప్పిదాల వల్ల పట్టా భూమి ఉన్న రైతులకు కూడా పంట రుణాలు రాని దుస్థితి నెలకొందని ధ్వజమెత్తారు.
ధరణి పోర్టల్‌ నిర్వాహక సంస్థలపై అనేక ఆరోపణలు వస్తున్నాయని, వాటికి కొమ్ముకాసేలా సీఎం కేసీఆర్ వ్యవహారం ఉందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే.. ధరణి బాధ్యతలను పేరున్న సంస్థలకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ధరణిలో జరిగిన తప్పులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం సవరించకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు.
 బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ‘రెవెన్యూ చట్టాలు- ధరణిలో లోపాల’పై నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సంజయ్‌ మాట్లాడుతూ  ధరణి పోర్టల్‌ ప్రారంభమై రెండేళ్లైనా సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని విచారం వ్యక్తం చేశారు. లక్షల మంది రైతులు, మాజీ సైనికాధికారులు సహా ప్రజలు దీనివల్ల కష్టాలు పడుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.
 మొత్తం భూముల్లో పోడు భూములెన్ని? పట్టా భూములెన్ని? అసైన్డు, పోరంబోకు, ఇనాంభూములెన్ని అనేది వెల్లడించకపోవడం దారుణమని విమర్శించారు.
‘‘కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే కోసం రూ.వందల కోట్ల నిధులు మంజూరు చేసినా ఇప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం బాధాకరం. కేంద్ర నిధులను ముఖ్యమంత్రి దారి మళ్లిస్తూ తన కుటుంబానికి, బినామీ సంస్థలకు ఉపయోగపడేలా ధరణి పోర్టల్‌ను తీర్చిదిద్దారు” అని సంజయ్ ఆరోపించారు.
1935లో నిజాం కాలంనాటి రికార్డులనే ప్రామాణికంగా తీసుకుంటుండడం శోచనీయం అని విమర్శించారు. అసైన్డు భూముల రైతులకు శాశ్వత హక్కులు కల్పించాలని హైకోర్టు రెండుసార్లు తీర్పులిచ్చినా పట్టించుకున్న దాఖలాల్లేవని తెలిపారు. పట్టా భూములను నిషేధిత జాబితాలో పేర్కొనడం అన్యాయం అని స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్లు ఈ సమస్యలతోనే సతమతమవుతున్నా సీఎం పట్టించుకోవడం లేదని పేర్కొంటూ రాష్ట్ర వ్యాప్తంగా ధరణి పోర్టల్‌లో 5 లక్షల దరఖాస్తులు వచ్చాయంటే.. సమస్య తీవ్రత ఎంతో అర్థం చేసుకోవచ్చని సంజయ్‌ చెప్పారు.
కాగా, అసైన్డు భూములకు శాశ్వత హక్కుల సాధన సంఘం నాయకులు గుమ్మి రాజ్‌కుమార్‌ రెడ్డి, మన్నె నరసింహారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న 24 లక్షల ఎకరాల అసైన్డు భూములుంటే.. 14 లక్షల రైతు కుటుంబాలు సాగు చేసుకుంటున్నాయని, వీరిలో అత్యధికులు దళిత గిరిజన, బలహీనవర్గాలకు చెందిన వారేనని తెలిపారు.
1958 కంటే ముందు అసైన్డ్‌ భూములు కలిగిన ఉన్న వారికి భూమిపై శాశ్వత హక్కులున్నాయని, వారికి అమ్ముకునే హక్కు కూడా ఉందని హైకోర్టు తీర్పులున్నాయని పేర్కొన్నారు. ఇకనైనా రైతాంగానికి అసైన్డు భూములపై శాశ్వత హక్కులు కల్పించాలని కోరారు.
లీగల్‌గా ఎదురవుతున్న ఇబ్బందులపై న్యాయపరంగా పలు పిటిషన్లు దాఖలు చేసిన సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ శర్మ మాట్లాడుతూ తెలంగాణలో రెవెన్యూ చట్టాలు తప్పుల తడకగా ఉన్నాయని విమర్శించారు. పోడు భూములను బడా కార్పొరేట్‌ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు.
ధరణి పోర్టల్‌ వల్ల ఇబ్బందులు పడుతున్న పలువురు రైతులు మాట్లాడుతూ.. గతంలో కొనుక్కున్న భూములకు సంబంధించి పాత యజమానుల పేర్లే కనిపిస్తున్నాయని, దీంతో పాత యాజమానులను బతిమిలాడుకుని మళ్లీ డబ్బులిచ్చి సంతకాలు చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, మాజీ ఎంపీలు ఏపీ జితేందర్‌రెడ్డి, విజయశాంతి,  ఎమ్యెల్యే ఈటల రాజేందర్‌, మాజీ ఎమ్యెల్యేలు  స్వామిగౌడ్‌, ఇంద్రసేనారెడ్డి  తదితరులు పాల్గొన్నారు.