వచ్చే 25 ఏళ్ల పాటు దేశ పునాదులు పటిష్టంగా ఉండేలా కృషి 

‘సబ్‌ కా సాత్ సబ్‌ కా వికాస్’ మూలసూత్రంతో ప్రభుత్వం పనిచేస్తోందని, వచ్చే 25 ఏళ్ల పాటు దేశ పునాదులు పటిష్టంగా ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ  దేశం సాధించిన ప్రగతి, సురక్షిత భవిష్యత్ కోసం ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తోందో వివరించారు.
 
భారతీయులందరికీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ‘స్వాతంత్ర్య అమృతోత్సవ్’ శుభాకాంక్షలు తెలుపుతూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులందరికీ నివాళులు తెలియజేశారు. కరోనా మహమ్మారిపై భారత్ పోరాటం స్ఫూర్తిదాయకమని రాష్ట్రపతి  ప్రశంసించారు. 
 
వ్యాక్సినేషన్ ప్రోగ్రాం ద్వారా కోవిడ్‌పై పోరాటం భారతదేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటారని ప్రభుత్వాన్ని రాష్ట్రపతి కొనియాడారు. కేవలం ఏడాది కంటే తక్కువ వ్యవధిలోనే 150 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ డోసులు తీసుకోవడం రికార్డని చెప్పారు. 
 
70 శాతం మంది లబ్ధిదారులు రెండో డోసు కూడా తీసుకున్నారని చెప్పారు. వ్యాక్సిన్‌తో కోట్లాది మంది ప్రజల ప్రాణాలు కాపాడగలిగామని సంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలోని రైతులందరికీ సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్రపతి ప్రశంసించారు.
కీలక విధానాల్లో రైతులు, చిన్నరైతులకు అండగా ప్రభుత్వం ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతుల ఆదాయం పెరిగేందుకు పలు చర్యలు తీసుకుందని చెప్పారు. దేశ వ్యవసాయ ఎగుమతులు రూ.2 లక్షల కోట్లు దాటాయని చెప్పారు.
 2020-21 కోవిడ్ మహమ్మారి సమయంలోనూ 30 కోట్ల టన్నుల ఆహారధాన్యాలు పండించారని, 33 కోట్ల హార్టీకల్చర్ ఉత్పత్తులు సాధించారని చెప్పారు. ప్రభుత్వం 433 లక్షల మెట్రిక్ టన్నుల గోదువులు సేకరించిందని, దీంతో 50 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని చెప్పారు.
పేద ప్రజలకు గూడు (ఆవాసం) కల్పించే హక్కును సాకారం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ఏ ఒక్కరూ ఆకలితో నిద్రపోకూడదనే సంకల్పంతో ముందకు వెళ్తోందని రాష్ట్రపతి పేర్కొన్నారు. హర్ ఘర్ జల్ ఇనేషియేటివ్ కింద గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు ఆరు కోట్లకు పైగా  ట్యాప్ వాటర్ సౌకర్యం కల్పించిందని చెప్పారు.
స్వాతంత్య్రం, సమత్వం, సామరస్యం ఆధారిత సమాజమే ఆదర్శ సమాజమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను రాష్ట్రపతి తన ప్రసంగంలో గుర్తుచేశారు. ప్రజాస్వామ్య పునాదులు ప్రజలను గౌరవించడంలోనే ఉందని, బాబాసాహెబ్ మార్గదర్శక సూత్రాలు, సిద్ధాంతాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
ఫార్మారంగానికి ప్రభుత్వం దన్నుగా నిలుస్తోందని చెప్పారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాల ద్వారా ఫార్మారంగం అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. ఆయుర్వదం, దేశవాళీ చికిత్స వంటివి కూడా ప్రభుత్వ పథకాలంతో లబ్ధి పొందుతున్నాయని చెప్పారు.
పేద ప్రజల హెల్త్‌కేర్‌కు ఆయుష్మాన్ భారత్, ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి హెల్త్‌కేర్ సంక్షోభాన్నైనా నివారించేందుకు రూ.64,000 కోట్లతో ఆయుష్మాన్ భారత్ హెల్త్‌కేర్ ఇన్‌ఫ్రాస్టక్చర్ మిషన్ సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు.
 
 భారత్‌ గ్లోబల్‌ మ్యాన్యుఫాక్చరింగ్‌ హబ్‌గా మారుతోందని రాష్ట్రపతి తెలిపారు.  దేశంలో జీఎస్టీ వసూళ్లు బాగా పెరిగాయని పేర్కొన్నారు. భారీగా వస్తున్న ఎఫ్‌డీఐలు దేశ అభివృద్ధిని సూచిస్తున్నాయని తెలిపారు. మేకిన్‌ ఇండియాతో మొబైల్‌ పరిశ్రమ వృద్ధి చెందుతోందని కొనియాడారు. 

7 మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌లతో యువతకు భారీగా ఉద్యోగాల కల్పన చేసినట్లు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ తెలిపారు. ఈ ఏడాది 10 రాష్ట్రాల్లో 19 బీటెక్‌ కాలేజీల్లో 6 స్థానిక భాషలలో బోధన జరుగుందని రామ్‌నాథ్‌ పేర్కొన్నారు. పీఎమ్‌గ్రామీణ సడక్‌ యోజనలతో రోజుకు 100 కి.మీ రహదారుల నిర్మాణం చేసినట్లు చెప్పారు. నదుల అనుసంధానంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ తెలిపారు.

పార్లమెంట్‌ ఆవరణలో అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ దేశాభివృద్ధికి ఇది కీలక సమయమని, బడ్జెట్‌ సమావేశాలకు విపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఒక వంక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ పార్లమెంట్ లో అర్ధవంతమైన చర్చలు జరగాలని అభిలాష వ్యక్తం చేశారు. 

మరోవంక, పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా పెగాసస్, రైతు ఆందోళనలు, చైనా దురాక్రమణలు సహా పలు అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని విపక్షాలు సిద్ధమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌పై దృష్టి సారించింది. సమావేశాలు ప్రారంభమయ్యే ముందు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషీ, రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు వేర్వేరుగా విపక్ష నేతలతో సమావేశమవుతారు.