హైదరాబాద్ లో విజృంభిస్తున్న కరోనా మూడో వేవ్

గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా మూడో వేవ్ విజృంభిస్తూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. దీనికి తోడు చలి తీవ్రత పెరగడంతో నగరవాసులు దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడుతూ వైరస్ సోకిదనే భయంతో స్దానికంగా ఉండే ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్‌లో నిరీక్షణ చేస్తూ టెస్టుల కోసం నమూనాలు ఇస్తున్నారు. 

గత మూడు వారాలుగా వైద్య సిబ్బంది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కేంద్రాల వద్ద ఉంటూ వచ్చిన వారందరికి పరీక్షలు చేసి వ్యాధి నిర్దారణ చేస్తున్నారు. కొన్ని ఆరోగ్య కేంద్రాల్లో జనం రద్దీగా ఉండటంతో ఒక రోజు నమూనాలు, మరో రోజు ఫలితాలు వెల్లడిస్తున్నట్లు రోగులు పేర్కొంటున్నారు. 

దీంతో చాలామంది లక్షణాలున్న ప్రజల మధ్య దర్జాగా తిరుగుతూ ఇతరులకు సోకేలా చేస్తున్నారని వైద్యశాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షణాలున్న వారు హోంఐసోలేషన్‌లో ఉండాలని సూచనలు చేసిన పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు. పాజిటివ్‌గా తేలితే వారికి కరోనా కిట్లు అందజేస్తున్నట్లు, పరిస్దితి తీవ్రంగా ఉంటే వెంటనే గాందీ, టిమ్స్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు.

రోజుకు 60 నుంచి 70 మంది పరీక్షల కోసం వస్తున్నట్లు పట్టణ ఆరోగ్య కేంద్రాల సిబ్బంది పేర్కొంటున్నారు. నగరంలో 196 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీదవఖానలో ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల నుంచి పరీక్షల కోసం వచ్చే రోగుల సంఖ్య పెరిగిందంటున్నారు.

మరో రెండు వారాల పాటు ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యం కాపాడుకోవచ్చని వైద్యశాఖ పేర్కొనడంతో నగర ప్రజలు వైరస్ లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేసుకుంటున్నారని కేంద్రాలు సిబ్బంది చెబుతున్నారు. జనం రద్దీని దృష్టిలో పెట్టుకుని సరిపడ కిట్లు, సిబ్బందిని ఏర్పాటు చేసినట్ల్లు పేర్కొంటున్నారు. 

ఈ మాసంలో పెళ్లి ముహూర్తాలు ఉండటంతో వైరస్ ఉనికి చాటే వాతావరణ ఉందని, వేడుకలను పరిమిత సంఖ్యలో చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. థర్డ్‌వేవ్ కూడా పాఠశాలల నుంచి ప్రారంభమైందని, తాజాగా స్కూళ్లు ప్రారంభించడంతో నిర్వహకులు కోవిడ్ నిబంధనలు పాటించి విద్యార్థులకు పాఠాలు బోధిస్తే మహమ్మారి వేగానికి కళ్లెం వేయవచ్చని వైద్యాధికారులు వెల్లడించారు.

కాగా, తెలంగాణాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 94,020 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 2,850 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 859 కేసులు నమోదుకాగా.. మేడ్చల్ మల్కాజ్ గిరిలో 173, రంగారెడ్డిలో 157, సిద్దిపేట 101మంది చొప్పున వైరస్ బారిన పడ్డారు. గత 24 గంటల్లో 4,291 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25,625 యాక్టివ్ కేసులు ఉండగా.. 3,205 శాంపిల్స్ రిజల్ట్స్ రావాల్సి ఉంది.

పాఠశాలల్లో హాజరు అంతంతమాత్రం 

సంక్రాంతి, మూడో వేవ్​తో ​సెలవుల పొడిగింపు తర్వాత 24 రోజుల అనంతరం నగరంలో  మంగళవారం నుంచి విద్యాసంస్థలను తెరిచారు. అయితే మొదటిరోజున  ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో హాజరు 10 నుంచి 40 శాతంలోపే నమోదైంది. మరోవైపు కరోనా ఆందోళనతో పాటు పాటు అమావాస్య సెంటిమెంట్ తో నేరుగా తరగతులకు పంపేందుకు పలువురు తల్లితండ్రులు ఆసక్తి చూపలేదు.

 ప్రభుత్వ  బడులన్నీ  తెరిచినా,  ప్రైవేట్ లో దాదాపు 60 శాతం స్కూళ్లను తెరవలేదు. ఆన్​ లైన్​క్లాసులు కూడా జరుగుతున్నాయి. మరోవంక, పాఠశాలను తెరవడంపై విద్యాశాఖ కొద్దిరోజుల కిందటే ఉత్తర్వులు ఇచ్చినా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన నకిలీ కారణంగా మంగళవారం స్కూల్ ఉంటుందో లేదోననే డైలమాలో చాలామంది చాలామంది తల్లితండ్రులు తమ పిల్లలను  బడులకు పంపలేదని చెబుతున్నారు.

కరోనా నిబంధనలను పాటిస్తూ శానిటైజేషన్, క్లీనింగ్, ఫిజికల్​ డిస్టెన్స్ రూల్స్ పాటించినా పిల్లలు ఎక్కువగా రాలేదని పలువురు ప్రధానోపాధ్యాయులు చెప్పారు. బెంచీకి ఇద్దరిని కూర్చొబెట్టి జాగ్రత్తలు పాటించేలా చూస్తున్నారు.