కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలకు ఆమోదయోగ్యమైన బడ్జెట్ను రూపొందించిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పీపుల్ ఫ్రెండ్లీ ప్రొగ్రెసివ్ బడ్జెట్ను ప్రవేశపెట్టినందుకు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నిర్మలమ్మ పద్దు అన్ని రంగాలకు అనుకూలమైందన్న మోదీ, దేశ యువత ఉజ్వల భవిష్యత్తుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు.
మరిన్ని పెట్టుబడులు, మరింత అభివృద్ధి, మరిన్ని ఉద్యోగాలకు నూతన అవకాశాలను తీసుకొచ్చే బడ్జెట్ ఇది అని తెలిపారు.ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ సరైన దిశలోనే సాగుతోందన్న ఆయన.. ఇంటర్నెట్, టెక్నాలజీ అభివృద్ధిపై దృష్టి సారించినట్లు చెప్పారు. గంగానది ప్రక్షాళనకు పెద్దపీట వేశామని, ఆ నదీ తీర రాష్ట్రాల్లో సహజసిద్ధ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
ఉద్యోగులు, మౌళిక వసతుల కల్పన, అభివృద్ధి ప్రాతిపదికన బడ్జెట్ను రూపొందించినట్లు ప్రధాని చెప్పారు. ఈ బడ్జెట్ ద్వారా 68శాతం దేశీయ పరిశ్రమలకు లాభం చేకూరుతుందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. రక్షణ రంగానికి బడ్జెట్లో పెద్దపీట వేశామని మోదీ ప్రకటించారు.
మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల ప్రోత్సాహం, ఉద్యోగాల కల్పనకు ఈ బడ్జెట్ దోహదపడుతుందని చెప్పారు. బుధవారం ఉదయం 11 గంటలకు బడ్జెట్పై విస్తృతంగా మాట్లాడతానని ప్రధాని ప్రకటించారు.
వందేళ్లలో వచ్చిన భయానక విపత్తు కోవిడ్-19 మహమ్మారి సమయంలో అభివృద్ధి పట్ల నూతన ఆత్మవిశ్వాసాన్ని ఈ బడ్జెట్ తీసుకొచ్చిందని ఆయన తెలిపారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు ఈ బడ్జెట్ సామాన్యులకు అనేక నూతన అవకాశాలను సృష్టిస్తుందని చెప్పారు.
పేదల సంక్షేమం ఈ బడ్జెట్‌లో చాలా ముఖ్యమైన అంశమని చెప్పారు. ప్రతి పేద వ్యక్తికి తప్పనిసరిగా ఓ పక్కా గృహం, కొళాయి నీరు, మరుగుదొడ్డి, గ్యాస్ సదుపాయం ఉండాలన్నారు. ఈ బడ్జెట్‌లో వీటన్నిటి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించారని తెలిపారు. అదే సమయంలో ఆధునిక ఇంటర్నట్ కనెక్టివిటీపై సమానంగా శ్రద్ధ చూపించారని వివరించారు.
ప్రజల నుంచి వస్తున్న స్పందన వారికి మరింత సేవ చేయాలనే తపనను, దృఢనిశ్చయాన్ని బీజేపీలో పెంచిందని చెప్పారు. పర్వతమాల స్కీమ్ మన దేశంలో మొదటిసారి అమలవుతోందని ప్రధాని పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ-కశ్మీరు, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ పథకం వల్ల పర్వతాలపై ఆధునిక రవాణా వ్యవస్థ నిర్మితమవుతోందని చెప్పారు.
‘గరీబ్ కల్యాణ్’ బడ్జెట్
నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్భుతంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. ఈ బడ్జెట్ దార్శనికతగా ఉందని ఆయన కొనియాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో ఇది సహాయ పడుతుందని పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో కూడా భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ది చెందుతున్నట్లు బడ్జెట్ లో స్పష్టంగా కనిపించిందని చెప్పారు.
మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బడ్జెట్ దూరదృష్టితో కూడిదని….ఇది భారత ఆర్థిక వ్యవస్థ స్థాయిని మార్చే బడ్జెట్ గా రుజువు చేస్తుందని చెప్పారు. కరోనా కష్టకాలంలో కూడా అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా మార్చడానికి ఈ బడ్జెట్ సహాయపడుతుందని చెప్పారు. ఆర్థిక లోటు 6.9 నుంచి 6.4 శాతానికి తగ్గించడం గొప్ప విజయమని చెప్పారు. మోదీ నాయకత్వంలో ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి తగ్గించామని చెప్పారు.
More Stories
ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల్లోపోటీ
చైనా, ఇజ్రాయిల్, మయాన్మార్ ల్లోనే అత్యధికంగా జైళ్లలో జర్నలిస్టులు
కాలేజీల్లో కనిపించని 20 వేల మంది భారతీయ విద్యార్థులు!