ఈ బడ్జెట్ లో రానున్న పాతికేళ్ళకు బ్లూప్రింట్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ, 100 సంవత్సరాల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. 
ప్రస్తుతం మనం 75 ఏళ్ల స్వాతంత్య్ర  దినోత్సవాన్ని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌గా జరుపుకొంటున్నామని, ఈ ఏడాది బడ్జెట్‌ రాబోయే 25 ఏళ్లలో ఆర్థికాభివృద్ధికి అవసరమైన పునాదిని వేసే బ్లూ ప్రింట్‌గా ఉంటుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. 
 తమ ప్రభుత్వం పౌరుల ప్రయోజనాలే లక్ష్యంగా ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెడుతున్నట్లు చెబుతూ స్వయం సమృద్ధి సాధించడంపై ఈ బడ్జెట్ దృష్టి పెట్టిందని ఆమె పేర్కొన్నారు. ద్రవ్య స్థితిపై పూర్తి పారదర్శకతను పాటిస్తున్నట్లు చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటున్నట్లు ఆమె తెలిపారు.  
గృహ నిర్మాణంపై దృష్టి సారించామని చెబుతూ తాము చేపడుతున్న చర్యలకు చెప్పుకోదగ్గ ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు.   ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిందని చెబుతూ  త్వరలోనే ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూకు రాబోతున్నట్లు ఆమె తెలిపారు. ఆత్మ నిర్భర్ మిషన్ క్రింద 60 లక్షల ఉద్యోగాల సృష్టి జరిగిందని ఆమె వెల్లడించారు.
 మూల ధన వ్యయం పెరిగిందని, ఆధునిక మౌలిక సదుపాయాలకు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం రాబోతోందని పేర్కొంటూ వెనుకబడిన వర్గాలు, యువత, రైతులపై ప్రధాన దృష్టితో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. 

మూడేళ్ళలో 100 కార్గో టెర్మినల్స్ 

రానున్న మూడేళ్ళలో 100 కార్గో టెర్మినల్స్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారం బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఆతిథ్య రంగం పునరుజ్జీవం కోసం కృషి చేస్తామన్నారు. ఎంఎస్ఎంఈ రంగంలో అదనంగా రూ.2 లక్షల కోట్ల క్రెడిట్ సదుపాయం కల్పిస్తామన్నారు. 

స్టార్టప్ కంపెనీలను ‘డ్రోన్ శక్తి’ ద్వారా ప్రోత్సహిస్తామని తెలిపారు. డ్రోన్ టెక్నాలజీకి ఈ బడ్జెట్‌లో గట్టి ప్రోత్సాహం కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యా రంగానికి ప్రోత్సాహంలో భాగంగా 200 టీవీ చానళ్ళకు ఈ-విద్యను విస్తరిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలకు ఈ-కంటెంట్ డెలివరీని ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. 
 
విద్యార్థుల కోసం డిజిటల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.  నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌, నేషనల్ టెలీ హెల్త్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తామన్నారు. మెరుగైన మౌలిక సదుపాయాలతో నూతన తరం అంగన్వాడీల ఏర్పాటు చేస్తామని, 2 లక్షల అంగన్వాడీలను అప్‌గ్రేడ్ చేస్తామని చెప్పారు. 
 
దేశవ్యాప్తంగా నూటికి నూరు శాతం తపాలా కార్యాలయాలు కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌లోకి వస్తాయని ఆర్థిక మంత్రి తెలిపారు. తపాలా కార్యాలయాలు ఆర్థిక సమ్మిళితత్వంలో భాగస్వాములవుతాయని ఆమె పెర్కోన్నారు. విశ్వాస ఆధారిత పరిపాలన కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. 
 
ప్రజలకు అన్ని సేవలు ఒకే చోట లభించే విధంగా కృషి చేస్తామని స్పష్టం చేశారు.  ఈ-పాస్‌పోర్టుల జారీ 2022లో ప్రారంభమవుతుందన్నారు. దీంతో ప్రయాణాలు సులభతరం అవుతాయన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0 ప్రారంభమవుతుందన్నారు.
టైర్ 2, టైర్ 3 నగరాలకు మరిన్ని నిధులను కేటాయించి, అభివృద్ధి చేస్తామన్నారు. హై లెవెల్ అర్బన్ ప్లానింగ్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ప్రారంభిస్తామని చెప్పారు. 2047 నాటికి దేశంలో సగం జనాభా నగరాల్లోనే ఉంటుందని, నగరాల అభివృద్ధికి పెద్ద పీట వేస్తామని చెప్పారు.
ఈ-వెహికిల్స్ కోసం బ్యాటరీ స్వాపింగ్ పాలసీని ప్రకటించారు. పట్టణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాల మౌలిక సదుపాయాలను ఆధునికీకరిస్తామని తెలిపారు. ప్రజా రవాణా పర్యావరణ హితంగా మారడానికి ఈ చర్యలు దోహదపడతాయని విశ్లేషకులు చెప్తున్నారు.

 5జీ స్పెక్ట్రమ్ వేలం ఈ ఏడాదే

5జీ స్పెక్ట్రమ్‌కు ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాలు ఇస్తామని ఆర్థిక మంత్రి  లోక్‌సభకు  చెప్పారు. 5G స్పెక్ట్రమ్‌ వేలం ఈ ఏడాది ప్రారంభమవుతుందని వెల్లడించారు. 2025నాటికి దేశంలోని అన్ని గ్రామాకూ ఆప్టికల్ ఫైబర్ విస్తరిస్తుందని తెలిపారు.
రక్షణ రంగానికి అవసరమైనవాటిలో 68 శాతం వరకు దేశీయ మార్కెట్ల నుంచే సేకరిస్తామని ఆమె చెప్పారు. ఎండ్-టు-ఎండ్ ఈ-బిల్ ద్వారా పారదర్శకతను తీసుకొస్తామని చెప్పారు. తదుపరి తరం సాంకేతిక పరిజ్ఞానంపై బడ్జెట్‌లో దృష్టిసారించినట్లు తెలిపారు. 
2030నాటికి 280 గిగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సోలార్ ఎనర్జీలో హై ఎఫిషియెన్సీ మాడ్యూల్స్‌కు  ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ రూ.19,500 కోట్లు అందజేయనున్నట్లు ప్రకటించారు. 
ప్రధాన మంత్రి గతి శక్తి మిషన్, సమ్మిళిత అభివృద్ధి, ఉత్పాదకత పెంపు, ఆర్థిక పెట్టుబడులు- ఈ నాలుగు అంశాలపై ఈ బడ్జెట్ ప్రధానంగా దృష్టి సారిస్తుందని ఆర్థిక మంత్రి  చెప్పారు.  25,000 కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారుల విస్తరణను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.  కొత్తగా 400  వందే భారత్ రైళ్ళను ప్రారంభిస్తామన్నారు.