తమిళనాడులో ఒంటరిగా పోటీకి బిజెపి సిద్ధం

ప్రతిపక్ష అన్నాడీఎంకే-బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చే కనిపించక పోవడంతో మున్సిపల్‌ ఎన్నికల్లో ఒంటరి పోరుకు  బీజేపీ సిద్ధమైంది.  ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, కేంద్ర మాజీ మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌, నాయకులుకరు నాగరాజన్‌, వీపీ దురైస్వామి తదితరులతో కలిసి సోమవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఒంటరిగా పోటీ చేస్తున్నంత మాత్రాన అన్నాడీఎంకే కూటమి నుంచి వైదొలగినట్లని ఎవ్వరూ భావించరాదని, మున్ముందు తమ పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఇబ్బందుల్ని గ్రహించి, వారిపై వున్న ఒత్తిడిని అర్థం చేసుకుని ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు.
ఎన్డీయే లో అన్నా డీఎంకే కొనసాగుతుందని, 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల వరకూ రెండు పార్టీల మధ్య సఖ్యత ఫదిలంగానే ఉంటుందని పేర్కొన్నారు. తమ పార్టీ అభ్యర్థుల జాబితాను వీలైనంత త్వర గా విడుదల చేస్తామని తెలిపారు.  ఈ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేస్తామని తెలిపారు. తమ సత్తా చాటేందుకు ఇదొక మంచి అవకాశమని పార్టీ శ్రేణులంతా భావించాలని  ఆయన పిలుపునిచ్చారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంతో పాటు పార్టీలోని లుకలుకలతో అన్నాడీఎంకే కొట్టు మిట్టాడుతోంది. కిందిస్థాయి ఎన్నికల్లో పుంజుకోనిపక్షంలో కార్యకర్తలు నిరాశకు గురి కావడం ఖాయమని ఆందోళన చెందుతున్న నేపథ్యంలో బీజేపీ కోరిన మేరకు సీట్ల సర్దుబాట్లు ప్రశ్నగా తలెత్తిన్నట్లు  తెలుస్తోంది.
తమకు రెండు మేయర్‌ పదవులతో పాటు, 20 శాతం వార్డులు కూడా కావాలని బిజెపి డిమాండ్‌ చేయడంతో అన్నాడీఎంకే అధినేతలైన ఎడప్పాడి పళనిస్వామి, ఒ.పన్నీర్‌సెల్వం అనాసక్తి ప్రదర్శించినట్లు తెలుస్తున్నది. కానీ తాము 10 శాతం కౌన్సిలర్ల పదవులు ఇవ్వగలమని, లేనిపక్షంలో కిందిస్థాయిలో వ్యతిరేకత వస్తుందని అన్నాడీఎంకే నేతలు బీజేపీకి స్పష్టం చేశారు.
అయితే బీజేపీ రాష్ట్ర నేతలు ససేమిరా అనడంతో అన్నాడీఎంకే నేతలు కూడా అనాసక్తి చూపించినట్టు తెలుస్తోంది. దీనికి తోడు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో జత కట్టడం  తమ విజయంపై ప్రతికూల ప్రభావం చూపినట్లు అన్నాడీఎంకే లో కొన్ని  భావిస్తున్నాయి.
మరోవంక,  బీజేపీతో పొత్తు తేల్చకముందే ఆదివారమే పలు చోట్ల అభ్యర్థులను అన్నాడీఎంకే ప్రకటించింది. అదే విధంగా రాష్ట్రంలో తమ పార్టీ గణనీయంగా పుంజుకుందని భావించిన బీజేపీ నేతలు ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగి ప్రయోగం చేయాలని యోచిస్తున్నారు.
ఈ ఎన్నికల్లో ఓడినా, గెలిచినా పార్టీకి పెద్దగా వచ్చేదేమీ లేనందున, అసలు తమ ఓటు బ్యాంకు ఎంత వుందో తెలుసుకునేందుకు ఒంటరిపోటీ దోహదపడుతుందని వారు భావిస్తున్నారు. అందుకే అన్నాడీఎంకేతో అవగాహన మేరకే ఒంటరి నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.