గాంధీజీ స్వదేశికి కొత్త నిర్వచనం మోదీ పధకాలు!

మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, వోకల్ ఫర్ లోకల్ వంటి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ పథకాలు మహాత్మా గాంధీ ప్రోత్సహించిన స్వదేశీ ఉద్యమానికి కొత్త నిర్వచనాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. 

భారత్  స్వాతంత్య్రం సాధించిన తర్వాత దేశాన్ని పునర్నిర్మించడం కోసం  మహాత్మాగాంధీ సూచించిన ఈ ఆశయాలను ఇంతకాలం మరిచిపోయారని, అనేక సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ గాంధీజీ ఆశయాలకు కొత్త రూపు కలిగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా అమరవీరుల దినోత్సవంగా జరుపుకునే సందర్భంగా ఆయన గోడ కుడ్యచిత్రాన్ని ఆవిష్కరించేందుకు అహ్మదాబాద్‌లో ఉన్నారు. ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ కమీషన్ (కెవిఐసీ) ద్వారా ఏర్పాటు చేసిన కుడ్యచిత్రం  సబర్మతి నదీతీరంలో గోడకు అలంకరించారు. 

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ శిక్షణ పొందిన 75 మంది కుమ్మరులు తయారు చేసిన 2,975 మట్టి కుండలను ఉపయోగించి 100 చదరపు మీటర్ల అల్యూమినియం ప్లేట్‌పై దీన్ని తయారు చేశారు.

“మహాత్మా గాంధీ భారతదేశపు స్వాతంత్య్రం కోసం పోరాడడమే కాకుండా, స్వాతంత్య్రం పొందిన తర్వాత దేశాన్ని పునర్నిర్మించడానికి స్వదేశీ, సత్యాగ్రహం, స్వభాష, సాధన శుద్ధి, అపరిగ్రహ (నిర్ధారణ), ప్రార్థన, ఉపవాసం,  సరళత ద్వారా అనేక మార్గాలను అందించారు,” అని అమిత్ షా గుర్తు చేశారు. 

 బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్న సమయంలో మహాత్మాగాంధీ ఈ ఆలోచనలను పౌరుల చైతన్యంలో నింపారని, తద్వారా స్వాతంత్య్రం సాధించిన తర్వాత దేశ పునర్నిర్మాణానికి వారిని పునాదిగా మార్చారని ఆయన పేర్కొన్నారు.

 “దురదృష్టవశాత్తు, బాపు ఫోటోలకు నివాళులు అర్పించినప్పుడు, చాలా సంవత్సరాలుగా ఆయన ప్రసంగాలలో ప్రస్తావనలు కనిపించినప్పుడు, ఖాదీ, హస్తకళలు, స్వభాషా,  స్వదేశీ వినియోగం మరచిపోయారు. ప్రధానమంత్రి అయిన తర్వాత, నరేంద్ర మోదీ  కొత్త జీవితాన్ని అందించారు. ఇవన్నీ బాపు ఆలోచనలే” అని ఆయన వివరించారు.

ఆత్మనిర్భర్త (స్వయం-విశ్వాసం) ద్వారా భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చడం,  స్వదేశీ ఉత్పత్తులను ఉపయోగించాలని 130 కోట్ల మంది భారతీయులకు విజ్ఞప్తి — ఈ మూడు ఆలోచనలు బాపు స్వదేశీ (ఉద్యమం) నుండి ఉద్భవించాయని ఆయన చెప్పారు. 

 ఖాదీ వినియోగాన్ని పునరుద్ధరించేందుకు మోదీ చేస్తున్న కృషి వల్ల కేవీఐసీ రూ.95,000 కోట్ల టర్నోవర్ సాధించేందుకు దోహదపడిందని షా చెప్పారు. ఖాదీ దుస్తులను ఉపయోగించాలని గుజరాత్ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

 “ఖాదీ పేదలకు సాధికారత సాధించే మార్గం మాత్రమే కాదు, భారతదేశపు ఆత్మగౌరవానికి ఒక ఉదాహరణ” అని ఆయన తెలిపారు, మహాత్మా గాంధీ ప్రతిపాదించిన ఖాదీని ఉపయోగించడం వెనుక ఉన్న ఆలోచనలు నేటికీ వర్తిస్తాయని ఆయన చెప్పారు.

కొత్త విద్యా విధానం స్వభాషకు ప్రాధాన్యతనిస్తుందని అమిత్ షా గుర్తు చేశారు. కొత్త విద్యా విధానం భారతీయ భాషలకు తగిన ప్రాధాన్యతనిస్తుందని, ఎందుకంటే భారతదేశంను తన భాషల నుండి వేరు చేస్తే, అది తన సంస్కృతి, చరిత్ర, సాహిత్యం, వ్యాకరణంల నుండి వేరవుతుందని అమిత్ షా హెచ్చరించారు. 

 ఈ సందర్భంగా కేంద్ర ఎంఎస్‌ఎంఈ మంత్రి నారాయణ్‌ రాణే మాట్లాడుతూ ఈ గోడపత్రిక మహాత్మాగాంధీకి తన మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే కేవీఐసీ ద్వారా అపూర్వమైన నివాళి అని కొనియాడారు. ఖాదీ, ఉపాధి కల్పన, భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ ఆలోచనలు నేడు దేశాన్ని నడిపిస్తున్నాయని రాణే చెప్పారు.

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75వ సంవత్సరంలో మహాత్మా గాంధీకి ఈ కుడ్యచిత్రం పరిపూర్ణ నివాళి అని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తెలిపారు. సబర్మతీ నది ఒడ్డున అందాలను పెంచడంతో పాటు రాష్ట్ర నిర్మాణం (దేశ నిర్మాణం) అనే సందేశాన్ని ఈ కుడ్యచిత్రం కొనసాగిస్తుందని సీఎం చెప్పారు. 

75వ స్వాతంత్య్ర సంవత్సరంలో జాతిపిత మహాత్మా గాంధీ 74వ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కుడ్యచిత్రాన్ని ఏర్పాటు చేసినట్లు కేవీఐసి ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా కేవీఐసీ పథకాల కింద 600 మంది లబ్ధిదారులకు విద్యుత్ కుండల చక్రాలు, బీ బాక్సులను అందజేశారు.