కరోనా నుంచి కోలుకున్న లతా మంగేష్కర్

కరోనా బారినపడిన చికిత్స పొందుతున్న బాలీవుడ్ ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్   ఆరోగ్యం బాగా మెరుగుపడుతోందని, చికిత్సకు ఆమె బాగా సహకరిస్తున్నారని  మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే ప్రకటించారు. ప్రస్తుతం లతా మంగేష్కర్ కరోనా,  నిమోనియాల నుంచి కోలుకున్నారని మంత్రి తెలిపారు. 
 
తాను స్వయంగా ఆమెకు వైద్యం చేస్తున్న డాక్టర్ ప్రతీత్ సందానీతో మాట్లాడానని, కొద్ది రోజుల పాటు క్రిటికల్ కండిషన్‌లో ఉన్న ఆమె ఆరోగ్యం ప్రస్తుతం బాగా మెరుగుపడిందని డాక్టర్ చెప్పారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్ అవసరం కూడా లేదని, కేవలం ఆక్సిజన్ సపోర్ట్‌తో చికిత్స పొందుతున్నారని మంత్రి వివరించారు. 
 
కరోనా నుంచి కోలుకున్నప్పటి నుంచి కొంత బలహీనంగా ఉన్నారని, పూర్తిగా నార్మల్ అయ్యేందుకు మరికొన్ని రోజుల సమయం పడుతుందని ఆయన తెలిపారు. లతా మంగేష్కర్ ఈ నెల 8న కరోనా బారిన పడ్డారు. ఆమెకు సింప్టమ్స్ ఎక్కువగా ఉండడంతో ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.
ఒక దశలో ఆమె ఆరోగ్యం చాలా క్రిటికల్‌ కండిషన్‌లో ఉండింది. ఆమెకు డాక్టర్ ప్రతీత్ సందానీ నేతృత్వంలోని వైద్యుల బృందం వెంటిలేటర్‌‌పై ట్రీట్‌మెంట్ అందించారు.  ఆరోగ్యం మెరుగుపడడంతో మూడ్రోజుల క్రితం వెంటిలేటర్ సపోర్ట్ తొలగించారు. ప్రస్తుతం లతా మంగేష్కర్ ఆరోగ్యం రోజు రోజుకీ మెరుగుపడుతోందని, కరోనా నుంచి కూడా కోలుకున్నారని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు.