పంజాబ్ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు 38 మందే!

ప్రగతిశీల ప్రజలుగా, సంపన్న రాష్ట్రంగా పేరొందిన పంజాబ్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో 117 స్థానాలకు గాను కేవలం 28 మాత్రమే మహిళా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వారిలో ఆప్‌ 12 స్థానాల్లో, కాంగ్రెస్‌ 11, సంయుక్త సమాజ్‌ మోర్చా ఇద్దర్ని, బిజెపి దాని కూటమి ఎనిమిది మంది, శిరోమణి అకాలీదళ్‌ ఐదుగురిని బరిలోకి దింపుతున్నాయి. 
 
ఈ సంఖ్య చూస్తే గతం కన్నా హీనంగా ఉంది. దీని బట్టి చూస్తే చట్టసభల్లో మహిళల ఉనికి కోల్పోయేటట్లు కనిపిస్తోంది. ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్, బిజెపి పోటీపడి ఎక్కువగా మహిళా అభ్యర్థులకు సీట్లు ఇస్తుండగా, ఇక్కడ అంతంత మాత్రంగానే ఇవ్వడం గమనిస్తే  చట్టసభల్లో మహిళల ఉనికి కోల్పోయేటట్లు కనిపిస్తోంది.
 
1957 నుండి 2017 అసెంబ్లీ ఎన్నికల వరకు మొత్తం 507 మంది మహిళలు పోటీ చేస్తే.. గెలిచింది కేవలం 86 మందే. 2012లో అత్యధికంగా 14 మంది మహిళలు ఎన్నికయ్యారు. 2012లో 67 నియోజక వర్గాల్లో 93 మంది మహిళలు పోటీ చేస్తే గెలుపొందిందీ మాత్రం 14 మంది మాత్రమే.
 
గత అసెంబ్లీ ఎన్నికల్లో పురుషులతో పోల్చుకుంటే మహిళల ఓటింగ్‌ శాతం అధికం కావడం గమనిస్తే వారిలో పెరుగుతున్న రాజకీయ చైతన్యం కనిపిస్తున్నది. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు కల్పిస్తామని ప్రతి ప్రభుత్వం చెబుతున్నా.. వాటి ఆచరణలో అసాధ్యమౌతోంది.
 
1952లో తొలిసారిగా పంజాబ్‌కు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. సుమారు ఏడు దశాబ్దాల తర్వాత జరగుతున్న ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహిళల ప్రాతినిధ్యంలో పెద్ద మార్పులేమీ చోటుచేసుకోలేదు. దీంతో మహిళలు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎందుకు ముందుకు రావడం లేదని, వారి ఉనికిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
 
పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు తప్పనిసరి చేస్తూ 2018లో చట్టం చేయడంతో  అప్పటి నుండి స్త్రీల ప్రాధాన్యత పెరిగింది. పంజాబ్‌లోని పంచాయతీ రాజ్‌ సంస్థల (పిఆర్‌ఐ)లో ఎన్నికైన మహిళా ప్రతినిధుల సంఖ్య 40 శాతం కన్నా ఎక్కువగా ఉంది.
 
చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళ కేవలం ఆ పాత్ర పోషించడానికే పరిమితమని, నిర్ణయం తీసుకునే అధికారం మాత్రం తనకు కాదని మహిళా నేతలు వాపోతున్నారు. అసెంబ్లీకి పెద్ద సంఖ్యలో మహిళలు ఎన్నికైనప్పటికీ.. స్వతంత్య్రంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి మాత్రం ఉండదని చెబుతున్నారు.
 
రాజకీయ పార్టీలు మహిళల ఓటర్లను ఆకర్షించేందుకు వాగ్దానాలు, పథకాలు, కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నా వారికి మెరుగైన రాజకీయ ప్రాతినిధ్యం పెంపొందించే విషయంలో మాత్రం తగు చొరవ చూపలేని పరిస్థితులు నెలకొన్నాయి.