భారత్‌ను హిందూ దేశంగా ప్రకటించాలి

భారత్‌ను హిందూ దేశంగా ప్రకటించాలని ఉత్తర్‌ప్రదేశ్‌లోని పవిత్ర సంగమం (గంగ, యమున, సరస్వతి నదుల సంగమం) వద్ద మాఘ మేళా సందర్భంగా ధర్మ సంసద్ పిలుపిచ్చింది. మహాత్మాగాంధీని జాతిపితగా, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూను దేశ తొలి ప్రధానమంత్రిగా గుర్తించడానికి ఈ సదస్సులో కొందరు సాధువులు నిరాకరించారు.

సుమేరు శంకరమఠాధిపతి స్వామి నరేంద్రనంద సరస్వతితోసహా పలువురు పీఠాధిపతులు, స్వామీజీలు, సాధువులు పాల్గొన్న ఈ ధర్మ సంసద్‌లో మూడు తీర్మానాలను ఆమోదించారు. భారత్‌ను హిందూ దేశంగా ప్రకటించాలన్న డిమాండ్‌తోపాటు మతమార్పిడులకు పాల్పడేఆరికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.

హరిద్వార్ ధర్మ సంసద్‌లో విద్వేష ప్రసంగాలు చేశారన్నకేసులో అరెస్టు చేసిన హిందూ సాధువు యతి యతి నరసింహానందతోపాటు ఇటీవలే హిందూ మతాన్ని స్వీకరించిన షియా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ జితేంద్ర నారాయణ్ త్యాగిని వెంటనే విడుదల చేయాలని డిమాండు చేస్తూ తీర్మానాలు ఆమోదించారు.

భారత్‌లాంటి దేశంలో జాతి పుత్ర ఉంటారు కాని జాతి పిత ఉండరని స్వామి నరేంద్రనంద సరస్వతి తన ప్రసంగంలో స్పష్టం చేశారు. 15 దేశాల మద్దతు ఉన్న నేతాజీ సుభాష్ చంద్ర బోసును దేశ తొలి ప్రధానమంత్రిగా ప్రకటించాలని, దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికే బోసు భారత్‌కు ప్రధానమంత్రని ఆయన చెప్పారు.

నరసింహానంద, త్యాగిలను జైలు నుంచి వెంటనే విడుదల చేయకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా సాధువులు హెచ్చరించారు. తమ సమావేశానికి జిల్లా అధికార యంత్రాంగం అనుమతి ఇవ్వకపోవడంతో నిర్వాహకకులు దీని పేరును ధర్మ సంసద్‌కు బదులుగా సంత్ సమ్మేళన్ అని మార్చినట్లు వర్గాలు తెలిపాయి.