జైషే కమాండర్ సహా ఐదుగురు ఉగ్రవాదులు హతం

జమ్మూ కశ్మీర్‌లో తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ సంస్థలకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారని జమ్మూ కశ్మీర్‌ పోలీసులు ఆదివారం పేర్కొన్నారు. రాష్ట్రంలోని పుల్వామా, బుడ్గాం జిల్లాలో ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగిందని వారు పేర్కొన్నారు.
 
 కాగా, మరణించిన ఉగ్రవాదులు ఒకరు జైషే మహ్మద్ సంస్థ కమాండర్ జహిద్ వని ఉన్నట్లు తెలిపారు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను పొట్టనపెట్టుకున్న దారుణ ఘటనలో జహిద్ వని ప్రమేయం ఉందని పోలీసులు తెలిపారు. జహిద్ వనితో పాటు తాజాగా మరణించిన మిగతా ఉగ్రవాదులను కూడా గుర్తించారు. 
 
ముగ్గురు వహిద్ అహ్మద్ రిషి, కఫీల్, ఇనాయుతుల్లా అని మిగతా ఒక ఉగ్రవాది వివరాలు ఇంకా తెలియలేదని చెప్పారు. శనివారం సాయంత్రం కశ్మీర్‌ జోన్‌ పోలీసులకు ఉగ్రవాదులకు మధ్య పుల్వామాలోని నైరా ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది.
 
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు మృతి 
కాగా, ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఆదివారం ఉదయం పోలీసులు, మావోయిస్టులు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు మృతి చెందగా.. పలువురు తప్పించుకున్నారు. చింతల్ నార్- తిమ్మాపురం అటవీ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది.
సుక్మాలోని తిమ్మాపురం అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) కోబ్రా 201 బెటాలియన్ సంయుక్త ఆపరేషన్‌లో ఒక నక్సల్‌ను కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు.