మార్చి 7 వరకు ఎగ్జిట్ పోల్స్ నిషేధం

ఉత్తరప్రదేశ్, పంజాబ్,ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వ తేదీ మధ్య ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయరాదని, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎలెక్ట్రానిక్ , ప్రింట్ మీడియాలతో పాటు మరే ఇతర వేదికలపైనైనా ఈ రెండు తేదీల మధ్య ఎగ్జిట్ పోల్స్ ప్రదర్శన నిషేధించినట్టు ప్రకటించింది.

 ఫిబ్రవరి 10 ఉదయం 7 గంటల నుంచి మార్చి 7 సాయంత్రం 6.30 గంటల వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని వివరించింది. ఇదే ప్రకటనలో పోలింగ్ ప్రక్రియ గురించి ఈసీ కొన్ని సూచనలు చేసింది. ఎన్నికలు జరిగే ఆయా ప్రాంతాల్లో సాధ్యాసాధ్యాల బట్టి నిర్ణీత సమయానికి మించి మరో అరగంట వరకు పోలింగ్ కొనసాగించవచ్చని పేర్కొంది.

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగే ఉప ఎన్నికలకు కూడా ఈ సూచనలు వర్తిస్తాయని పేర్కొంది. ఇక ఒపీనియన్ పోల్స్‌పై కూడా ఈసీ స్పందించింది.పోలింగ్ ప్రారంభమయ్యే 48 గంటల ముందే ఒపీనియన్ పోల్స్‌ను నిలిపివేయాలని పేర్కొంది. 

ఈ ఆదేశాలను ఎవరైనా అతిక్రమిస్తే రెండు నెలలు జైలుశిక్ష లేదంటే జరిమానా, లేదంటే ఈ రెండూ ఒకేసారి శిక్షగా అనుభవించాల్సి ఉంటుందని వివరించింది. 

యూపీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 మధ్య ఏడుదశల్లో కొనసాగుతుంది. ఇక మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ ఫిబ్రవరి 27, మార్చి 3 రెండు దశల్లో , పంజాబ్ ఫిబ్రవరి 20, ఉత్తరాఖండ్ , గోవాల్లో ఫిబ్రవరి 14న ఎన్నికల పోలింగ్ జరగనుంది.