ర్యాలీలు, రోడ్‌షోలపై ఫిబ్రవరి 11 వరకూ నిషేధం పొడిగింపు

అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న 5 రాష్ట్రాల్లో భౌతిక  ర్యాలీలు, రోడ్‌షోలపై విధించిన నిషేధాన్ని మరోసారి ఎన్నికల కమిషన్ (ఈసీ) సోమవారంనాడు పొడిగించింది. ఫిబ్రవరి11వ తేదీ వరకూ నిషేధాన్ని పొడిగిస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. 
 
ఐదు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితిని సమీక్షించిన అనంతరం భౌతిక ర్యాలీలపై నిషేధం పొడిగించాలని నిర్ణయించినట్టు తెలిపింది. గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని కరోనా పరిస్థితిపై ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర, ఎన్నికల కమిషనర్లు రాజీవ్ కుమార్, అనూప్ చంద్ర పాండే సమగ్ర సమీక్ష జరిపారు. అనంతరం కొత్త మార్గదర్శకాలను ప్రకటించారు.
 
భౌతిక బహిరంగ సమావేశాలు, ఇండోర్ సమావేశాలు, ఇంటింటి ప్రచారాలకు సంబంధించిన కొన్ని సడలింపులను ఈసీ ప్రకటించింది. బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే రాజకీయ సమావేశాలకు హాజరయ్యే వారి సంఖ్యను 500 నుంచి 1000కి పెంచింది. 
 
ఇక ఇంటింటి ప్రచారంలో ఇప్పటి వరకు అభ్యర్థితో పాటు 10 మందికి మాత్రమే అనుమతించగా.. ఇప్పుడు ఆ సంఖ్యను 20కు పెంచింది.
 
రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు కరోనా నిబంధనలను, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. కాగా, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10, మార్చి 7వ తేదీ మధ్య జరుగుతాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.