విచారణను తప్పించుకోవడానికే మూడు రాజధానుల రద్దు 

హైకోర్టులో విచారణ నుంచి తప్పించుకొనేందుకే రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల చట్టం రద్దు చేసిందని పిటిషనర్లు ఆరోపించారు. మళ్లీ మార్పులతో ఆ చట్టం తెస్తామని బహిరంగానే చెబుతోందని ఏపీ హైకోర్టులో న్యాయవాదులు ఆరోపించారు. సీఆర్‌డీఏ రద్దు, పరిపాలన వికేంద్రీకరణ చట్టాల రద్దు బిల్లులు గవర్నర్‌ ఆమోదముద్రతో చట్టరూపం దాల్చడంతో  రాజధాని అమరావతిపై దాఖలైన వ్యాజ్యాల్లో ఎన్ని అభ్యర్ధనలు మనుగడలో ఉన్నాయి? ఎన్ని నిరర్థకమయ్యాయనే విషయంపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది.
పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ రాజధాని ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే విషయాన్ని నిర్ణయించే అధికారం గానీ, 3రాజధానులు చట్టాన్ని తీసుకొచ్చే అధికారం గానీ, వాటిని రద్దు చేసే అధికారం గానీ రాష్ట్ర ప్రభుత్వానికి లేవని స్పష్టం చేశారు. విభజన చట్టం ప్రకారం… రాజధాని ఏర్పాటుపై నిర్ణయంతీసుకొనేందుకు రాష్ట్రానికి కేంద్రం ఒక్కసారే అధికారం కల్పించిందని, దాని ప్రకారం అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేస్తూ చట్టసభలు ఇదివరకే తీర్మానం చేశాయని తెలిపారు.
మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని పేర్కొన్నారు. రాజధానిప్రాంతంలో నిలిపివేసిన పనులు కొనసాగించాలని, మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేసి రైతులకు అభివృద్ధి చేసిన ఫ్లాట్లు ఇవ్వాలన్న తమ అభ్యర్ధనపై విచారణ కొనసాగించాలని కోరారు. శుక్రవారం విచారణలో పిటిషనర్ల తరఫు వాదనలు ముగిశాయి. రాష్ట్రప్రభుత్వం, సీఆర్‌డీఏ, శాసనసభ కార్యదర్శి తరఫు వాదనలు కొనసాగించేందుకు ధర్మాసనం విచారణను ఫిబ్రవరి 2కి వాయిదా వేసింది.
రాజధాని అభివృద్ధికి గతంలో ఇచ్చిన స్టేట్‌సకో ఉత్తర్వులు అడ్డంకి కాబోవని ఇటీవల ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కోర్ట్ పొడిగించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలిచ్చింది.
రాజధాని విషయంలో సీఆర్‌డీఏ రద్దు చట్టం, పాలనా వికేంద్రీకరణ చట్టాలను రద్దు చేస్తూ చట్టసభలు తీసుకొచ్చిన బిల్లులకు గవర్నర్‌ ఆమోదముద్ర వేయడంతో అవి చట్టరూపం(యాక్ట్‌ 11/2021) దాల్చాయని గుర్తు చేసిన త్రిసభ్య ధర్మాసనం… రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చిన నేపధ్యంలో రాజధానిపై దాఖలైన వ్యాజ్యాల్లో ఎన్ని వినతులు మనుగడలో ఉన్నాయి.
ఎన్ని నిరర్థకంగా మారాయి వంటి వివరాలతో నివేదిక సమర్పించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులను ఆదేశించింది. ఆ నివేదికపై స్పందన తెలియజేస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. శుక్రవారం ఈ వ్యాజ్యాలు విచారణకు రాగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తమ వ్యాజ్యాల్లో ఎన్ని అభ్యర్ధనలు మనగడలో ఉన్నాయో వివరించారు.
న్యాయవాది వాసిరెడ్డి ప్రభునాథ్‌ వాదనలు వినిపిస్తూ.. ‘మూడు రాజధానుల చట్టం చేసే అధికారం గానీ, తిరిగి దానిని రద్దు చేసే అధికారం గానీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. రాజధాని వ్యవహారం పార్లమెంటు పరిధిలోది. అమరావతిని రాజధానిగా చట్టసభల్లో ఆమోదించే క్రమంలో అప్పటి ప్రతిపక్షనేత, ప్రస్తుత సీఎం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు’ అని పేర్కొన్నారు.
కేంద్రం కూడా అమరావతిని రాజధానిగా గుర్తించింది. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ.1,500 కోట్లు విడుదల చేసిందని, గత ఏడేళ్లుగా శాసన, పరిపాలన, న్యాయ వ్యవస్థలు అమరావతి నుంచే తమ పనులు సాగిస్తున్నాయని గుర్తు చేశారు.  రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత ప్రస్తుత ప్రభుత్వం 3 రాజధానులను తెరపైకి తెచ్చిందని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రాంతాలు, ప్రజల మధ్యం విద్వేషాలు కలిగించేలా ఉండకూడదని స్పష్టం చేశారు.