వేతన సవరణ విషయమై రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా సమ్మె నోటీసు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరికి నిరసనగా జరుగుతున్న ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. మరోవంక, ప్రభుత్వం సవరించిన వేతనాల అమలు విషయంలో ముందుకు పోతూ, ఉద్యోగ సంఘాలలో చీలికలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది.
సమ్మె ప్రపంభిస్తే నిర్బంధ చర్యలకు కూడా పాల్పడి ఉద్యోగ సంఘాల నాయకులను అరెస్టులు చేయించేందుకు సహితం సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది. ఉదోయగుల సమ్మె విషయమై స్పందించా వలసిన ఆర్ధిక శాఖ మంత్రి ఎక్కడా కనిపించడం లేదు. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అంతా తానే అన్నట్లు చర్చలకు రాకుండా సమ్మె అంటే కుదరదని స్పష్టం చేశారు.
రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా అన్ని సంఘాలూ ఏకతాటిపైకి రావడం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవేస్తున్నది. ఉద్యోగ సంఘాలకు సంబంధించిన అన్ని సంఘాలూ ఏకతాటిపైకి వచ్చి పోరాట కమిటీగా ఏర్పడ్డాయి. కొత్తగా ఆర్‌టిసిలో ఉన్న కార్మిక సంఘాలన్నీ ఏకాభిప్రాయానికి వచ్చాయి.
ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పాటయ్యాయి. గతంలో ఎన్నడూ ఈ విధంగా జరగలేదు. ప్రభుత్వ ఉద్యోగులపై చర్చలు తీసుకున్న మరుక్షణమే బస్సులు ఎక్కడికక్కడ నిలిపేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర విభజనా నంతరం ఆర్‌టిసి ఉద్యోగ సంఘాలు ఒకేతాటిపైకి రావడం ఇదే తొలిసారి.
ఇప్పటికే నిరసన ప్రదర్శనలు చేపట్టిన ఉద్యోగ సంఘాలు మూడు రోజులుగా నిరాహారదీక్షలు చేపట్టాయి. అన్ని జిల్లాల్లో వేల సంఖ్యలో ఉద్యోగులు హాజరవుతున్నారు. ఫిబ్రవరి మూడోతేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిఓల అమలును నిలిపేయడంతోపాటు, ఈ నెల పాత జీతాలు వేస్తామని హామీనిస్తేనే చర్చలకు వస్తామనీ స్పష్టం చేస్తున్నారు.
ఒక్క పక్క చర్చలు జరపాలని ఒత్తిడి తెస్తూనే మరోవైపు జీతాల వేసే కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందేనని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆర్థికశాఖ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. శని, ఆదివారాల్లోనూ ఈ పని పూర్తిచేయాలని ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ అధికారులపై తీవ్రస్థాయిలో ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తున్నారు.
దీనిపై ట్రెజరీ ఉద్యోగుల సంఘం నాయకులు శోభన్‌బాబు ప్రభుత్వానికి లేఖ రాశారు. బిల్లులివ్వకుండా కొత్తజీతాల ప్రక్రియను చేపట్టకుండా జీతాలు వేయాలంటే వేయడం సాధ్యం కాదని, తామూ ఆందోళనలో ఉన్నామని లేఖలో పేర్కొన్నారు. అయినా ప్రభుత్వం పట్టువీడటం లేదు.
చర్చల విషయమై ఉద్యోగ నాయకులు పెదవి విరుస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రభుత్వంతో 12 సార్లు చర్చలు జరిపామని, అన్ని సందర్భాల్లోనూ సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారని, ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.
అర్ధరాత్రి జిఓలు రద్దు చేయకపోతే తాము చర్చలకు రాబోమని స్టీరింగ్ కమిటీ సభ్యులతో లిఖిత పూర్వక సమాచారం ఇచ్చామని, అయినా చర్చలకు రాలేదని చెప్పడం సరికాదని, మంత్రుల స్థాయిలో ఉండే వ్యక్తులు తప్పుడు ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదన్నారు.
More Stories
ట్రంప్ `పౌరసత్వం’ నిర్ణయంపై అమెరికాలోని 22 రాష్ర్టాల దావా
తిరుమలలో శారదాపీఠం అక్రమ నిర్మాణంపై హైకోర్టు ఆగ్రహం
ఈ నెల 22 నుంచి ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు!