అనర్హత వేటుపై ఫిబ్రవరి 11 వరకు జగన్‌కు గడువు

”అనర్హత వేటుపై ఫిబ్రవరి 11 వరకు సీఎం జగన్‌కు టైం ఇస్తున్నా.. ఏం చేస్తారో చేసుకోండి” అని ఎంపీ రఘురామకఅష్ణరాజు సవాల్‌ విసిరారు. రాజధాని విషయంలో మోసం చేసిన ప్రభుత్వంపై రైతులు కేసు పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. 

మూడు రాజధానులు తెచ్చే హక్కు వైసీపీ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. కోర్టులో అమరావతి రైతులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగులంతా ఐక్యంగా హక్కుల కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసు దర్యాప్తులో పురోగతి రావొచ్చని తెలిపారు. 

వైసిపి నేత శివశంకర్‌రెడ్డి తరపున ప్రభుత్వ లాయర్‌ చంద్ర ఓబుల్‌రెడ్డి వాదించారని పేర్కొంటూ ప్రభుత్వ తరపు న్యాయవాది పార్టీకి, నాయకుడి తరపున కేసు ఎలా వాదిస్తారు? అని రఘురామ ప్రశ్నించారు. చంద్ర ఓబుల్‌రెడ్డిపై బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌కి లేఖ రాశానని తెలిపారు. 

`హూ కిల్‌ బాబాయి’ అనేది ప్రజలందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. .డ్రగ్స్‌ నియంత్రణపై జగన్‌ సమీక్ష నిర్వహించాలని రఘురామకృష్ణరాజు డిమాండ్‌ చేశారు. జిల్లాల విభజన విషయంలో వైసీపీ కేడర్‌ కూడా మండిపడుతోందని చెప్పారు

ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెడితే ఆయన సమాజికం ఓట్లు పడతాయా? అని ప్రశ్నించారు. ప్రతి పథకానికి జగనన్న, వైయస్సార్ పేర్లు పెట్టే బదులు ఒక్క పథకానికైనా ఎన్టీఆర్ పేరు పెట్టొచ్చుకదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని రఘురామ అడిగారు.

 ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టినంత మాత్రాన ఆ సామాజికవర్గం ఓట్లు వైసీపీకి పడతాయా? అని ప్రశ్నించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై అసెంబ్లీలో చర్చించకుండా… మంత్రుల కాళ్లు కట్టేసి, ఎమ్మెల్యేల నోళ్లు నొక్కేసి సీఎం జగన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.

ఇలా ఉండగా, వైఎస్సార్‌సీపీ చీఫ్‌ విప్‌ మార్గాని భరత్‌ ఇచ్చిన ఫిర్యాదుపై రఘురామకృష్ణరాజు అనర్హత పిటిషన్‌పై త్వరితగతిన విచారణ జరిపి ప్రాథమిక నివేదిక ఇవ్వాలని స్పీకర్ ఓం బ్రిల  ప్రివిలేజ్‌ కమిటీని ఆదేశించారు. ఫిబ్రవరి 3వ తేదీన ప్రివిలేజ్‌ కమిటీ సమావేశం కానుంది. సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది.