కరోనా బారిన కేంద్ర మంత్రి జైశంకర్

దేశంలో కరోనా థర్డ్వేవ్ మహమ్మారి ఏ ఒక్కరిని వదలడం లేదు. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ.. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. 
 
తాజాగా, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ కూడా ఆ జాబితాలో చేరిపోయారు. తాను కరోనా  బారిన పడినట్లు జైశంకర్‌ ట్విటర్ ద్వారా వెల్లడించారు.
 
 ‘కొన్ని రోజులుగా తాను.. స్వల్ప అస్వస్థతగా ఉండటంతో.. కరోనా ఉండటంలో పరీక్షలు చేసుకున్నానని.. దీనిలో కరోనాగా నిర్ధారణ అయినట్లు తెలిపారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నట్లు ప్రకటించారు’. అదే విధంగా తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. 
 
ఇలా ఉండగా, కరోనా ఎదుర్కొనేందుకు పాటిస్తున్న రక్షణ చర్యలను ఫిబ్రవరి నెలాఖరు వరకూ కొనసాగించాలని, ఏమాత్రం పట్టు సడలించవద్దని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా కేసులు క్రమేపి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధానకార్యదర్శులకు లేఖ రాశారు. 
 
ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాల్సిందిగా సంబంధిత అధికారులను అప్రమత్తం చేయాలని కోరారు. ‘ఫిబ్రవరి 28 వరకూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తప్పనిసరిగా కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు రక్షణాత్మక చర్యలను పట్టు సడలించకుండా కొనసాగించాలి. అన్ని మార్గదర్శకాలను, ముందస్తు జాగ్రత్తలను తుచ తప్పకుండా పాటించాలని సూచించారు.