రాహుల్ పర్యటనలో ఐదుగురు కాంగ్రెస్ ఎంపీల గైరాజర్ 

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన సమయంలో పంజాబ్‌కు చెందిన ఐదుగురు పార్టీ ఎంపీలు దూరంగా ఉండటం ఆ పార్టీలో కలకలం రేపుతున్నది.  కీలకమైన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ పరిణామం పార్టీ వర్గాలలో ఆందళనకు దారితీస్తుంది.  గైరాజరైన ఎంపీలలో  మనీష్ తివారీ, జస్బీర్ సింగ్ డింపా, రవ్‌నీత్ బిట్టు, మహ్మద్ సాదిక్, ప్రణీత్ కౌర్ ఉన్నారు.

మరోవైపు రాహుల్‌ వెంట ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ అభ్యర్థులతో కలిసి స్వర్ణాలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత, రాహుల్ తన అధికారిక హ్యాండిల్ నుండి పంజాబ్ భవిష్యత్తు కోసం హరిమందర్ సాహిబ్‌లో ప్రార్థిస్తున్నట్లు ప్రకటించడంతో ‘లంగర్’లో పాల్గొన్నారు.

మరోవంక, వచ్చే 7– 10 రోజుల్లో పంజాబ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి పేరును ప్రకటించాలని రాహుల్‌గాంధీకి పీపీసీసీ చీఫ్‌ నవ్‌జోత్‌సింగ్‌ సిద్ధూ డెడ్‌లైన్‌ విధించారు. జలంధర్‌లో జరుగుతున్న ప్రచారంలో రాహుల్‌ను సిద్ధూ ప్రశ్నించారు. తనను షోకేస్‌లో బొమ్మలాగా ఎల్లకాలం చూపాలని కోరడం లేదని సిద్ధూ స్పష్టం చేశారు. సీఎం అభ్యర్ధి విషయంలో కాంగ్రెస్‌ హైకమాండ్‌ తక్షణం నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ఇదే వేదికపై ఉన్న ప్రస్తుత సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ కూడా అదే డిమాండ్‌ను వినిపించడంతో రాహుల్ ఇరకాటంలో పడ్డారు.  దానితో, పంజాబ్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలను సంప్రదించిన అనంతరం సీఎం అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామని రాహుల్‌గాంధీ ప్రకటించారు. అలా ప్రకటించాల్సిన అవసరం ఉందో, లేదో కూడా కార్యకర్తలను అడుగుతామని అంటూ అప్పటికి తప్పించుకున్నారు. 

గైరాజరైన వారిలో, తివారీ ఇటీవలి కాలంలో పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీపై ప్రశ్నలు లేవనెత్తారు. ఆయన లేకపోవడం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తీవ్రత వెల్లడవుతుంది. అయితే, అతను గురువారం నూర్పూర్ బేడి, ఇతర ప్రాంతాలకు వెళ్తున్నాడని, అందువల్ల అక్కడ ఉండలేక పోయారని అతని సహాయకుడు చెప్పాడు.

ఖాదూర్‌ సాహిబ్‌ నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ నిరాకరించడంతో డింపా ఆ పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారు. అతని కీలక సహాయకుడు సతీందర్ సింగ్ చజ్జల్‌వడ్డి సీటు నిరాకరించడంతో అకాలీదళ్‌లో చేరారు. జండియాలా నుంచి అకాలీదళ్ అభ్యర్థిగా ఆయనను ప్రకటించారు. అయితే తాను రాహుల్‌ పర్యటనను బహిష్కరించలేదని, అయితే తనను ఎవరూ ఆహ్వానించలేదని డింపా చెప్పారు.

“వారు 117 మంది అసెంబ్లీ అభ్యర్థులను మాత్రమే ఆహ్వానించాలనుకుంటున్నారని నేను అనుకున్నాను. సీఎం, ఏఐసీసీ ఇన్‌చార్జి లేదా పంజాబ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ నుంచి నాకు ఎలాంటి ఆహ్వానం అందలేదు. నా కోడలు చనిపోవడంతో స్వర్ణ దేవాలయానికి వెళ్లలేకపోను” అనిమహ్మద్ సాదిక్ చెప్పాడు.

మాజీ ముఖ్యమంత్రి  అమరీందర్ సింగ్ సతీమణి అయిన ప్రణీత్ కౌర్ తన భర్తను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అమరీందర్‌పై తిరుగుబాటు సమయంలో పలువురు ఎంపీలు ఆయనకు మద్దతుగా నిలిచారు.

భారత ఎన్నికల సంఘం జనవరి 8న ఎన్నికల తేదీలను ప్రకటించిన తర్వాత గురువారం నాటి పర్యటన రాహుల్ రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్లే మొదటి పర్యటన.  అంతకుముందు ఢిల్లీ నుంచి అమృత్‌సర్‌ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌ని చన్నీ, సిద్ధూ, ఉప ముఖ్యమంత్రులు సుఖ్‌జీందర్‌ సింగ్‌ రంధావా, ఓపీ సోనీలు స్వాగతం పలికారు. అనంతరం రాహుల్‌ జలియన్‌వాలాబాగ్‌, దుర్గియానా దేవాలయం, భగవాన్‌ వాల్మీకి తీర్‌ స్థల్‌లను సందర్శించారు.