తిరిగి టాటాల చేతికి ఎయిర్ ఇండియా 

ఎయిర్ ఇండియాను తిరిగి అధికారికంగా కేంద్రం టాటా గ్రూప్‌కు గురువారం అప్పగించింది. దీంతో ఆ విమానాయాన సంస్థ పూర్తి హక్కులు టాటాకు చేరుకున్నాయి. తిరిగి తమ సంస్థకు ఎయిర్ ఇండియా  చేరుకోవడంపై టాటాసన్స్‌ చైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ హర్షం వ్యక్తం చేశారు. 
 
ఈ అప్పగింతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీతో  చంద్రశేఖరన్‌ భేటీ అయ్యారు. ఎయిర్ ఇండియా ను గత ఏడాది అక్టోబర్‌లో టాటా గ్రూప్‌కు చెందిన టాలేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రూ. 18వేల కోట్లకు కేంద్రం విక్రయించింది. 
 
ఎయిర్‌లైన్స్‌లో 100 శాతం వాటాను విక్రయించడానికి ప్రభుత్వం సముఖత వ్యక్తం చేస్తూ.. టాటా గ్రూప్‌కు లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ (ఎల్‌ఒఐ) జారీ చేసింది. అనంతరం ఈ డీల్‌కు సంబంధించిన షేరు కొనుగోలు ఒప్పందంపై కేంద్రం సంతకం చేసింది. 
 
మరోవైపు అప్పులు ఊబిలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాకు  అప్పులిచ్చేందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నేతృత్వంలోని కన్సార్టియం అంగీకరించింది. టాటా గ్రూప్‌ నుండి ఎయిర్ ఇండియా ను  తీసుకున్న 69 సంవత్సరాల తర్వాత తిరిగి అదే సంస్థకు కేంద్రం అప్పగించింది.
‘‘కనిష్ట ప్రభుత్వం, గరిష్ఠ పాలన పట్ల తన నిబద్ధత గురించి మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన చర్యల ద్వారా వివరించి చెప్పారు’’ అని టాటా గ్రూప్ ప్రకటన పేర్కొంది.
ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణ లావాదేవీలకు సంబంధించిన అధికారిక లాంఛనాలన్నీ పూర్తయినట్లు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి తుహిన్ కాంత పాండే తెలిపారు. ప్రభుత్వానికి రూ.2,700 కోట్లు వచ్చిందని చెప్పారు. షేర్స్‌ను నూతన యజమాని తలకె కు బదిలీ చేసినట్లు చెప్పారు. ప్రతిఫలం సొమ్మును స్వీకరించినట్లు తెలిపారు. రూ.15,300 కోట్ల రుణాన్ని నూతన యాజమాన్యం అంగీకరించిందని పేర్కొన్నారు. నూతన బోర్డు ప్రస్తుతం సమావేశాన్ని నిర్వహిస్తోందని చెప్పారు.
పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ఇచ్చిన ట్వీట్‌లో, ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా విజయవంతంగా పూర్తి చేయడం గమనించదగిన అంశమని పేర్కొన్నారు. నాన్ స్ట్రాటజిక్ రంగాల్లో భవిష్యత్తులో చురుగ్గా పెట్టుబడుల ఉపసంహరణను సమర్థవంతంగా  నిర్వహించగల సత్తా ప్రభుత్వానికి ఉన్నట్లు ఈ ప్రక్రియ రుజువు చేసిందని తెలిపారు.
ఎయిరిండియాను టాటా గ్రూప్‌నకు అప్పగించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం గురువారం పూర్తి చేసింది. ఎయిరిండియా-స్పెషల్ పర్పస్ వెహికిల్ ఎఐఎహెచ్ ఎల్  మధ్య కుదిరిన ఒప్పందాన్ని ప్రభుత్వం నోటిఫై చేసింది. దాదాపు 69 సంవత్సరాల తర్వాత సుప్రసిద్ధ ‘‘మహారాజా’ను ఇక పూర్తిగా  టాటా గ్రూప్ సొంతం చేసుకుంది.  శుక్రవారం నుంచి ఎయిరిండియా కార్యకలాపాలు పూర్తిగా టాటా గ్రూప్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి.
గురువారం ఉదయం ఎయిరిండియా బోర్డు చివరి సమావేశం జరిగింది. టాటా గ్రూప్‌‌నకు ఈ సంస్థను అప్పగించేందుకు వీలుగా ఈ బోర్డు రాజీనామా చేసింది. ఎయిరిండియా అమ్మకానికి రూ.18,000 కోట్లకు టాటా గ్రూప్‌తో ప్రభుత్వం గత ఏడాది షేర్ పర్చేజ్ అగ్రిమెంట్‌పై సంతకాలు చేసింది.
 టాటా గ్రూప్ రూ.2,700 కోట్లు నగదు రూపంలో ప్రభుత్వానికి చెల్లించి, రూ.15,300 కోట్ల మేరకు అప్పులను స్వాధీనం చేసుకుంది. ఈ సంస్థను 1932లో టాటా గ్రూప్ స్థాపించిన సంగతి తెలిసిందే. ఎయిరిండియా స్వాధీనంతో విమానయాన రంగంలో దాదాపు 27 శాతం మార్కెట్ వాటాను కలిగియుండే సంస్థగా టాటా గ్రూప్ మారబోతోంది.