బహిరంగ మార్కెట్లో విక్రయానికి 2 టీకాలకు అనుమతి

కరోనా మహమ్మారి దెబ్బకు అల్లాడిపోతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలగనుంది. వ్యాప్తి అడ్డుకట్టకు టీకాలే కీలకమన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బహిరంగ మార్కెట్లో కొవిషీల్డ్​, కొవాగ్జిన్​ టీకాలకు విక్రయించేందుకు షరతులతో కూడిన అనుమతులను భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) జారీ చేసింది. 

డీసీజీఐ నుంచి సాధారణ అనుమతి పొందిన క్రమంలో ఫార్మా సంస్థలు టీకాల ధరలను నిర్ణయించనున్నాయి. సాధారణంగా టీకా ధర బహిరంగ మార్కెట్లో రూ.275గా నిర్ణయించే అవకాశం ఉండగా, దీనికి రూ.150 సేవా రుసుమ అదనంగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రైవేటులో కొవాగ్జిన్ ఒక డోసు ధర సేవా రుసుంతో కలిపి రూ.1200, కొవిషీల్డ్‌ ధర రూ.780 గా ఉంది. గతేడాది జనవరి 3న అత్యవసర పరిస్థితుల్లో వాడేందుకు ఈ రెండు టీకాలు డీసీజీఐ అనుమతులు ఇచ్చింది.

అయితే కొన్ని షరతులకు లోబడి ఈ రెండు టీకాలను వయోజనులకు ఇచ్చేందుకు సాధారణ అనుమతి ఇవ్వాలని జనవరి 9న నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ మేరకు సాధారణ అనుమతి కోసం అవసరమైన సమాచారం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా,భారత్ బయోటెక్ సంస్థలు ప్రభుత్వానికి అందజేశాయి.

వయోజనులకు అందించేందుకు కొన్ని షరతులకు లోబడి ఈ రెండు వ్యాక్సిన్లను మార్కెట్‌లో విక్రయించేందుకు అనుమతిలిచ్చినట్లు ఆరోగ్య శాఖ మంత్రి మన్షుఖ్‌ మాండవీయా తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. షరతులు ప్రకారం.. కొనసాగుతున్న క్లినికల్‌ ట్రయల్స్‌, ప్రోగ్రామాటిక్‌ సెట్టింగ్‌ కోసం సరఫరా చేసిన టీకాల సమాచారాన్ని సదరు సంస్థలు సమర్పించాలని పేర్కొన్నారు. ఈ రెండు వ్యాక్సిన్లను దుకాణాల్లో అమ్మరాదని, ప్రైవేటు ఆసుపత్రుల్లో, క్లినిక్స్‌ వీటిని కొనుగోలు చేసి.. ప్రజలకు అందించవచ్చునని తెలిపారు.

అయితే ఈ అమ్మకాలకు సంబంధించిన డేటా ప్రతి ఆరు నెలలకు ఒకసారి డీసీజీఐకి సమర్పించాలి. ఈ డేటా కోవిన్ యాప్‌లో కూడా అప్‌డేట్ చేయబడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.