పోలీసులు దగ్గరుండి దాడి చేయించారు…. అరవింద్

పోలీసులు దగ్గరుండి టీఆర్ఎస్ కార్యకర్తలతో తనపై దాడి చేయించారని, రాళ్లు, కత్తులతో టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని నిజామాబాదు బీజేపీకి ఎంపీ డి అరవింద్ ఆరోపించారు. తనపై దాడి పిరికి పందల చర్య అంటూ టిఆర్ఎస్ ను రాజకీయంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. 
 
 కేంద్ర హోంమంత్రికి దీనిపై ఫిర్యాదు చేస్తామని పేర్కొంటూ తనపై దాడి వెనుక సర్కారు కుట్ర ఉందని ధ్వజమెత్తారు. పోలీసులు దగ్గరుండి దాడి చేయించారని చెబుతూ ఈ దాడి వెనుక పోలీస్ కమీషనర్ పాత్ర కూడా ఉందని ఆరోపించారు. ఎంపీపై, కార్యకర్తలపై హత్యాయత్నం చేశారని మండిపడుతూ పోలీసులను గుండాలుగా తయారు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
తెలంగాణలో శాంతిభద్రతలు లేవని, బీజేపీ ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. నిజామాబాదు జిల్లాలోని ఆర్మూర్‌ ఇస్సాపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ అర్వింద్ పాల్గొన్న కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నిరసన తెలిపారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఇరువర్గాల నేతలను పోలీసులు అడ్డుకుని చెదరగొట్టారు.  
 
నందిపేట్‌లో అర్వింద్ పర్యటనను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ శ్రేణుల యత్నించడంతో : ఆర్మూర్‌లోని మామిడిపల్లి చౌరస్తాలో ధర్నాలో ఎంపీ అర్వింద్ పాల్గొన్నారు. సీపీ నాగరాజుకు ఫోన్‌లో పరిస్థితిని వివరించినా ఎలాంటి స్పందన లేకపోవడంతో పోలీస్ వైఖరిని నిరసిస్తూ ధర్నా చేపట్టినట్లు అరవింద్ పేర్కొన్నారు. 
 టీఆర్ఎస్ అడ్డుపడుతున్నది తనకు కాదు.. అభివృద్ధికి అని ఎంపీ అర్వింద్ విమర్శించారు. కరోనా నిబంధనలు బీజేపీ కార్యకర్తలకు మాత్రమే వర్తిస్తాయా? అని అర్వింద్ ప్రశ్నించారు. బీజేపీ ఎంపీలను అడ్డుకుంటున్న పోలీసులు,.. అధికార పార్టీ వారిని ఎందుకు అడ్డుకోరు? అని నిలదీసేరు. టీఆర్ఎస్ నేతల దౌర్జన్యాలు పోలీసులకు కనిపించడం లేదా? అని అర్వింద్ ప్రశ్నించారు.
 
దాడిలో తన వాహనం ధ్వంసం అయ్యిందని చెప్పారు. చాలా మంది కార్యకర్తలకు గాయాలయ్యాయి. ముందే సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. ఘటనపై పోలీస్ కమిషనర్ స్పందించడం లేదని విమర్శిస్తూ పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
 
కాగా, నిజామాబాద్ జిల్లాలో ఎంపీ అరవింద్‌పై టీఆర్ఎస్ గుండాలు, పోలీసులు కలిసి చేసిన దాడి చేసారని అంటూ  రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ను ప్రజలు పాలించడానికి ఎన్నుకున్నారా? లేక గూండాయిజం చేయడానికి ఎన్నుకున్నారా…? అని ఘాటుగా ప్రశ్నించారు. 
 
యువమోర్చా కార్యకర్తపై కత్తులతో దాడి చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీకి ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని, హోం గార్డును బదిలీ చేసే అధికారం కూడా డీజీపీకీ లేదా? అని ప్రశ్నించారు. సీపీ కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని తెలిపారు. తెలంగాణలో శాంతిభద్రతల సమస్య ఏర్పడిందని,  సీఎం కేసీఆర్ అలాంటి వాతావరణం సృష్టించారని విమర్శించారు. 
అరవింద్ పై జరిగిన దాడిని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ ఖండించారు. బిజెపిని ఎదుర్కోలేక దాడులు చేయడం కెసిఆర్ నియంతృత్వ పాలనకు నిదర్శనం అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ బెదిరింపులు, దాడులకు బిజెపి కార్యకర్తలు భయపడరని ఆమె స్పష్టం చేశారు. నియంత రజాకార్ సర్కారుపై బిజెపి పోరాటం ఆగదని ఆమె హెచ్చరించారు.