యువత ఉపాధికి కేంద్రం నిధుల తెలంగాణ దుర్వినియోగం 

మన దేశం లో 20 లక్షల మండి,నిరుద్యోగ గ్రామీణ యువతకు, శిక్షణ, ఉపాధి కల్పించే దిశగా కేంద్రం 2019లో ప్రారంభించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామీణ్ కౌషాల్య యోజన పధకం క్రింద తెలంగాణలో 90,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం రూ 818 కోట్ల వ్యయం కాగల ప్రాజెక్ట్ ను చేపట్టగా, అందులో తమ వంతు నిధులను విడుదల చేయక పోగా, కేంద్రం విడుదల చేసిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసినదాని బిజెపి సీనియర్ నాయకులు, కెవిఐసి దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షుడు పేరాల చంద్రశేఖరరావు ఆరోపించారు. 
ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయంలో కేంద్రం 60 శాతం నిధులు రూ 490 కోట్లు సమకూర్చవలసి ఉండగా, మిగిలిన 40 శాతం నిధులు రూ 328 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చవలసి ఉన్నట్లు ఆయన తెలిపారు. కేంద్రం మొదటి విడతగా 2019 సెప్టెంబర్  లోనే రూ 215 కోట్లు విడుదల చేసినదని, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ 143 కోట్లు విడుదల చేసి మొత్తం రూ 358 కోట్లు ఖర్చు పెట్టవలసి ఉన్నదని ఆయన చెప్పారు.
అయితే, రాష్ట్ర ప్రభుత్వం తన వంతు రూ 143 కోట్లు కేటాయింపక పోగా, డిసెంబర్ 2020లో కేంద్రం విడుదల చేసిన నిధుల నుండి రూ 103 కోట్లను మాత్రమే విడుదల చేసి, మిగిలిన మొత్తం రూ 255 కోట్లను ఇప్పటి వరకు విడుదల చేయలేదని ఆయన పేర్కొన్నారు.  ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి ఉంటె కేంద్రం మరిన్ని నిధులను విడుదల చేసి ఉండేదని ఆయన తెలిపారు.
 
తన వంతు నిధులను విడుదల చేయకపోగా, కేంద్రం విడుదల చేసిన నిధులలో రూ 112 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించినదని చంద్రశేఖరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ విధంగా చేయడం నిరుద్యోగుల పాలిట శాపంగా మారినదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
కాగా,   దారి మళ్లించిన కేంద్ర నిధులు 112కోట్లు, రాష్ట్రం ప్రభుత్వం తన వంతు వాటా  143 కోట్ల తో కలిపి మొత్తం 255 కోట్లను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి తెలంగాణ నిరుద్యోగ యువతకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.  
 
నిరుద్యోగులకు శిక్షణ నిమిత్తం కేంద్రం ఇచ్చిన నిధులను సద్వినియోగం చేయడంలో విఫలమైనటువంటి ఆర్ధిక శాఖ మంత్రి,  సంబందిత పంచాయతీ రాజ్,   గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి  తక్షణమే రాజీనామా చేయాలని స్పష్టం చేశారు. 
 
కేంద్రం ఇచ్చిన నిధులను  ఖర్చు  చేయడంలో విఫలమైన రాష్ట్రం ప్రభుత్వము కేంద్రం పై నిధులు విడుదల చేయడం లేదని నిందలు వేయడం ఎంత వరకు సమంజాసం? అని పేరాల ప్రశ్నించారు. ఇచ్చిన కేంద్ర నిధులు ఖర్చు చేసి తగిన నివేదికను సమర్పించిన పక్షంలో నిరుద్యోగుల అభ్యున్నతి కోసం  అదనపు నిధులు విడుదల చేయించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.