26 జిల్లాలుగా ఏపీ పునర్‌వ్యవస్థీకరణ

రాష్ట్రంలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ ప్రతిపాదనకు ఆంధ్ర  ప్రదేశ్ మంత్రివర్గం మంగళవారం ఆమోదముద్ర వేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను మంత్రులందరికీ పంపి ఆ తర్వాత ఆన్‌లైన్‌లో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. అంతకుముందు ఈ ప్రతిపాదనలకు 13 జిల్లాల కలెక్టర్లు ఆమోదం తెలిపారు. 

రాష్ట్ర స్థాయి కమిటీ సిఫారసులను జిల్లా కలెక్టర్లకు పంపి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, సీసీఎల్‌ఏ నీరబ్‌కుమార్‌ప్రసాద్‌ ఆన్‌లైన్‌లో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ ప్రతిపాదనలకు కలెక్టర్లందరూ ఆమోదం తెలిపారు.

 ఇంకా ఏవైనా అంశాలుంటే తుది నోటిఫికేషన్‌ ఇచ్చేలోగా తెలియచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. 1974 ఏపీ డిస్ట్రిక్ట్‌ (ఫార్మేషన్‌) చట్టం ప్రకారం కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. ఈ మొత్తం పక్రియ కేవలం ఒక రోజులోనే పూర్తి కావడం గమనార్హం. 

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో లోక్‌సభ నియోజకవర్గానికి ఒక జిల్లాను ఏర్పాటు చేస్తూ పునర్‌వ్యవస్థీకరణకు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సంకల్పించింది. జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో గతంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ సిఫారసుల మేరకు 26 జిల్లాలుగా పునర్‌వ్యవస్థీకరణ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి ఆమోదించారు.

ఈ నేపథ్యంలో జిల్లాలను పునర్‌వ్యవస్థీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలపై ప్రజలు, ప్రజాసంఘాల నుంచి ఫిబ్రవరి 26 వరకు అభిప్రాయాలను స్వీకరించనున్నారు. ఆ తర్వాత ప్రజాభిప్రాయం మేరకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ కానుంది. తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి అంటే ఏప్రిల్‌ 2వతేదీ నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణపై సుదీర్ఘ కసరత్తు చేసింది. ఈలోపు 2021 జనాభా గణన అంశం ముందుకు రావడంతో కొంత ఆలస్యమైంది. కరోనా వల్ల ఇప్పటికీ జనాభా గణన ప్రారంభం కాలేదు. అది ప్రారంభమయ్యేలోగా జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పార్లమెంటు నియోజకవర్గాల వారీగా చూస్తే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అరకు(రంపచోడవరం, పాతపట్నం) అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నరసాపురం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, బాపట్ల, నరసరావుపేట, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట, హిందూపురం, కడప, నంధ్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాలుగా ఏర్పాటు కానున్నాయి.

కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం 51 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోని మదనపల్లె రెవెన్యూ డివిజన్‌ అతి పెద్దది. 33 మండలాలు ఇందులో ఉంటాయి. పరిపాలన సౌలభ్యం కోసం కొత్తగా పది నుంచి 12 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదించింది.