యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న ఉక్రెయిన్‌

సోవియట్‌ యూనియన్‌ మాజీ రిపబ్లిక్‌ ఉక్రెయిన్‌ ను యుద్ధ మేఘాలు కమ్ముకొంటున్నాయి. ఉక్రెయిన్‌ను రష్యా ఆక్రమించబోతోందని, ఏ క్షణంలోనైనా యుద్ధం ప్రకటించవచ్చని రెండు నెలలుగా అమెరికా, బ్రిటన్‌ సహా నాటో కూటమి దేశాలు ఆరోపణలు చేస్తున్నాయి. 
 
ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో 1,20,000 మంది సైనికులను రష్యా మోహరించిందని,  అదే జరిగితే కఠినాతికఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తామని అమెరికా సారథ్యంలోని నాటో కూటమి హెచ్చరిస్తోంది.  మరోవంక, అమెరికా పెద్దఎత్తున యుద్ధనౌకలను, ఫైటర్‌ జెట్‌లను ఉక్రెయిన్‌కుతరలించింది.
బ్రిటీష్‌ దౌత్యవేత్తలకు ప్రత్యేకించి ఎలాంటి ముప్పు లేకపోయినప్పటికీ ప్రస్తుతానికి కీవ్‌లో పని చేస్తున్న సిబ్బందిలో సగం మందిని వెనక్కి రప్పిస్తున్నట్లు బ్రిటిష్‌ అధికారులు తెలిపారు. ఏ సమయంలోనైనా దాడి జరిగే అవకాశం వుందని పేర్కొంటూ ఎంబసీ సిబ్బంది కుటుంబ సభ్యులను అక్కడ నుండి రావాల్సిందిగా అమెరికా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
 
కాగా ఇయు సిబ్బంది ప్రస్తుతానికి అక్కడే వుంటారని, ఈ ఉద్రిక్తతలను నాటకీయం చేయాలని తాము అనుకోవడం లేదని ఇయు విదేశాంగ విధాన చీఫ్‌ జోసెఫ్‌ బోరెల్‌ వ్యాఖ్యానించారు. ఇదిలా వుండగా, డెన్మార్క్‌, స్పెయిన్‌, బల్గేరియా, నెదర్లాండ్స్‌లతో సహా నాటో సభ్య దేశాలు మరిన్ని యుద్ధ విమానాలను, యుద్ధ నౌకలను తూర్పు యూరప్‌కు పంపించాయి.
 
సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నం తర్వాత ఉక్రెయిన్‌ 1991 డిసెంబరు 1న స్వాతంత్య్రం ప్రకటించుకుంది. విస్తీర్ణం ప్రకారం రష్యా తర్వాత ఐరోపాలో రెండో అతిపెద్ద దేశమిది. జనాభాపరంగా ఎనిమిదోది. 8.13 కోట్ల మంది జనాభా ఉన్నారు. వీరిలో 17.3 శాతం మంది రష్యన్‌ జాతీయులే. 
 
సోవియట్‌ యూనియన్‌ పతనమయ్యాక రక్షణ, అణ్వస్త్ర, క్షిపణి పరిశ్రమలు, అపార ఖనిజ సంపద ఉక్రెయిన్‌లోనే ఉండిపోవడంతో రష్యా అది తన మిత్రదేశంగా.. తన ఛత్రఛాయల్లో కొనసాగాలని వాంఛించింది. కానీ నాటో కూటమిలో చేరాలని ఉక్రెయిన్‌ కోరుకుంది.  
 
నాటోలో అది చేరితే నాటో దళాలు తన సరిహద్దుల్లో తిష్ఠ వేస్తాయన్నది రష్యా ఆందోళన. అందుకే ఉక్రెయిన్‌ అణ్వస్త్రరహిత దేశంగా ఉండాలని.. నాటోలో చేరవద్దని ఆ దేశంపైన, దానిని చేర్చుకోవద్దని అమెరికా, ఐరోపా దేశాలపైన ఒత్తిడి తెస్తోంది. ఉక్రెయిన్‌ దారికి రాకపోవడంతో 2014లో క్రిమియాను ఆక్రమించుకుని తనలో విలీనం కూడా చేసుకుంది. 
 
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక ఐరోపా దేశం.. మరో దేశ భూభాగాన్ని ఆక్రమించుకుని కలుపుకోవడం ఇదే ప్రథమం. సెవొస్తోపోల్‌ ప్రాంతంలోనూ రష్యా అనుకూల ప్రభుత్వం నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో అమెరికా, నాటో దేశాలు ఉక్రెయిన్‌ రక్షణ కోసమంటూ అక్కడ సేనలను దించాయి.
స్వాతంత్య్రం తర్వాత ఉక్రెయిన్‌ తీరు తన భద్రతను ప్రమాదంలో పడవేయడంతో పుతిన్‌ ‘ఒకే రష్యా’ సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. బెలారస్‌, రష్యా, జార్జియా వంటి రిపబ్లిక్‌లన్నీ రష్యా నాగరికతలో భాగమని.. ఉక్రెయిన్‌ తమతో సన్నిహితంగా మెలగాలని కోరుతున్నారు. ఈ వాదనతో ఉక్రెయిన్‌ పాలకులు ఏకీభవించడం లేదు. భాషాపరంగా తామెప్పుడో విడిపోయామంటున్నారు.
ఉక్రెయిన్‌-రష్యా వివాదంలో అతి కీలకమైనది గ్యాస్‌ పైపులైన్‌ సమస్య. రష్యా నుంచి ఐరోపా దేశాలకు గ్యాస్‌, పెట్రోలు సరఫరా చేయాలంటే ఉక్రెయిన్‌ భూభాగం మీదుగా వేసిన పైపులైన్లే ఆధారం. ఇందుకోసం ఉక్రెయిన్‌కు రష్యా ఏటా మిలియన్ల డాలర్లు రాయల్టీగా కూడా చెల్లిస్తోంది.
అయితే ఉక్రెయిన్‌ పాలకులు తరచూ ఈ పైపులైన్లను స్తంభింపజేస్తామని బెదిరిస్తుండడంతో.. రష్యా ప్రత్యామ్నాయం ఆలోచించింది. బాల్టిక్‌ సముద్రగర్భం గుండా పైపులైన్ల నిర్మాణం చేపట్టింది. జర్మనీ వరకు పూర్తిచేసింది కూడా. ఫ్రాన్స్‌కు కూడా దీని ద్వారా ఇంధన సరఫరా చేస్తానని ప్రతిపాదించింది.
దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఐరోపాలో రష్యాను తీవ్రంగా వ్యతిరేకించే జర్మనీయే దానితో గ్యాస్‌ సరఫరాపై ఒప్పందం కుదుర్చుకోవడం.. ఫ్రాన్స్‌ కూడా సుముఖంగా ఉండడంతో అమెరికా, బిట్రన్‌లలో, సోవియట్‌ మాజీ రిపబ్లిక్‌లలో ఆందోళన మొదలైంది.  ఇలా ఉండగా, ఉక్రెయిన్‌కు గ్యాస్‌ రాయల్టీ రాకపోతే దాని ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని, అందుకే దానిని తాము ఆక్రమించబోతున్నట్లు ప్రచారం చేస్తున్నాయని.. యుద్ధ విన్యాసాలను సమర సన్నాహాలుగా పేర్కొంటూ తమపై దాడి చేయాలని చూస్తున్నాయని పుతిన్‌ విమర్శిస్తున్నారు.