సఫారీ కర్మచారి కమిషన్ పదవీకాలం పొడిగింపు.. సమరసత మంచ్ హర్షం

నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కరంచరీస్ (ఎన్ సి ఎస్ కె) పదవీకాలాన్ని మూడేళ్లపాటు పొడిగిస్తూ నరేంద్ర మోదీ-ప్రభుత్వ నిర్ణయాన్ని సామాజిక సమరసత మంచ్  స్వాగతించింది. భారత ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఎస్‌ఎస్‌ఎం అఖిల భారత కన్వీనర్ శ్యామ్ ప్రసాద్ కొనియాడారు.

గత ప్రభుత్వం పదవీకాలాన్ని ఒకొక్క సంవత్సరం, కొన్నిసార్లు ఆరు నెలలు పొడిగిస్తుండేదిదని, దాని  కారణంగా కమీషన్  సమర్థవంతంగా పనిచేయలేకపోయిందని ఆయన గుర్తు చేశారు. 43,797 మాన్యువల్ స్కావెంజర్లను గుర్తించిగా,  వారిలో 42,500 మందికి పైగా షెడ్యూల్డ్ కులాల వర్గానికి చెందిన వారని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి గత డిసెంబర్ 2న లోక్‌సభలో పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఇప్పటికీ మాన్యువల్ స్కావెంజర్లు తమ వృత్తి కారణంగా అంటరానివారిలో అంటరానివారిగా పరిగణించబడుతున్నారని,  వారు సమాజంలోని అన్ని వర్గాల వారి నుండి అవమానాలకు గురవుతున్నారని శ్యామ్ ప్రసాద్ విచారం వ్యక్తం చేశారు. 1993లో ఎకయీషన్  ఏర్పాటైనా వారి సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని ఆయన చెప్పారు.

చట్టాలు ఉన్నా మురుగు కాల్వలను శుభ్రం చేస్తూ ఎంతో మంది విలువైన ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల, డిసెంబర్ 23న మహారాష్ట్ర (సోలాపూర్)లో నలుగురు, డిసెంబర్ 16న గుజరాత్ (అహ్మదాబాద్)లో ముగ్గురు, సెప్టెంబరు 24న మధ్యప్రదేశ్ (సింగ్రౌలి)లో ముగ్గురు, జనవరి 15న తమిళనాడు (చెన్నై)లో ఒకరు,  జనవరి 19న తమిళనాడు (కాంచీపురం)లో ఇద్దరు చనిపోయారని వివరించారు.

సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో కమిషన్ సమర్థవంతమైన పాత్ర పోషిస్తున్నది శ్యామ్ ప్రసాద్ చెప్పారు.   ఇప్పటి వరకు  దురదృష్టవశాత్తు మురుగు కాలువలో పని చేస్తూ మరణించిన 671 మంది  సఫాయి కరంచారి బాధిత కుటుంబానికి రూ 10 లక్షలు చొప్పున చెల్లించినట్లు తెలిపారు.

దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయివేటు కాంట్రాక్టర్లకు క్లీనింగ్ పనులు ఇచ్చాయని, కాంట్రాక్టర్లు చట్టాలు, నిబంధనలు పాటించడం లేదని, దీని వల్ల మురుగు కాల్వల మరణాలు తగ్గడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కఠినమైన నిబంధనలు,  విధానాలు ఉన్నప్పటికీ, కాంట్రాక్టర్లు   చట్టపరమైన లొసుగులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా చట్టానికి చిక్కడం  లేదని, దానితో బాధిత కుటుంబం చట్టపరమైన ప్రయోజనాలను కోల్పోతుందని ఆయన చెప్పారు.అందువల్ల మురుగు కాల్వల మరణాలను సమర్థవంతంగా తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కమీషన్  సమన్వయం అవసరమని శ్యామ్ ప్రసాద్ సూచించారు.  ప్రైవేటీకరణ తర్వాత వారి సమస్యలు పెరిగాయని చెబుతూ, ఇప్పుడు , రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలకు ప్రత్యక్ష బాధ్యత వహించడం లేదని పేర్కొన్నారు.

కార్మికుల మౌలిక సమస్యలపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని శ్యామ్ ప్రసాద్ ఆరోపించారు. ఢిల్లీ, యూపీ, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో మురుగు కాల్వల మరణాలు ఎక్కువ అని చెప్పారు.

 కరోనా మహమ్మారి సమయంలో సఫాయి కార్మికులు   ఫ్రంట్‌లైన్ వర్కర్స్ గా పనిచేశారని ఆయన గుర్తు చేశారు. తన విధులను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు కమీషన్ కు  మరిన్ని రాజ్యాంగపరమైన అధికారాలు కల్పించాలని ఆయన కోరారు. సఫాయి కర్మచారులకు సామాజిక గౌరవం,  సమానత్వాన్ని అందించడానికి సామాజిక సమరత మంచ్ కట్టుబడి ఉన్నట్లు ఆయన తెలిపారు.