నేతాజీ త్యాగాలు దేశప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తే

స్వాతంత్య్ర సమర యోధుడు, ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
 
 “నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌కు భారతదేశం కృతజ్ఞతాపూర్వకంగా నివాళులర్పిస్తోంది. భారతదేశ స్వాతంత్య్రం కోసం ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ను స్థాపించి సుభాష్‌ చంద్రబోస్‌ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు ఆయనను దేశానికి ప్రతీకగా నిలిపాయి. ఆయన ఆదర్శాలు, త్యాగం ప్రతి భారతీయుడికీ నిరంతరం స్ఫూర్తినిస్తాయి” అని రాష్ట్రపతి కోవింద్‌ ట్వీట్‌ చేశారు. 
 
గొప్ప జాతీయవాది, దూరదృష్టి కలిగిన నాయకుడు నేతాజీ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. ఆయన జయంతిని పరాక్రమ్‌ దివస్‌ జరుపుకొంటున్నట్లు పేర్కొన్నారు.
 పార్లమెంటు సెంట్రల్‌ హాలులో జరిగిన వేడుకలలో ప్రధాని నరేంద్ర మోదీ నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనతోపాటు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు నేతాజీకి ఘనంగా నివాళులు అర్పించారు.
 ‘సుభాష్‌ చంద్రబో్‌సకు నమస్కరిస్తున్నా. దేశానికి ఆయన అందించిన సేవలకు ప్రతి భారతీయుడూ గర్విస్తున్నాడు’ అని మోదీ ట్వీట్‌ చేశారు. నేతాజీ జయంతిని కూడా వేడుకల్లో చేర్చుతూ.. కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా ఈ ఏడాది గణతంత్ర వేడుకలను జనవరి 23 నుంచే ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని ఇండియా గేట్‌ వద్ద బోస్‌ హోలోగ్రామ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
షింజో అబేకు నేతాజీ అవార్డు 
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి పురస్కరించుకుని నేతాజీ రీసెర్చ్ బ్యూరో జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు నేతాజీ అవార్డు 2022ను ప్రదానం చేసింది. 
 
ఈ మేరకు కోల్‌కతాలోని ఎల్గిన్ రోడ్‌లో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ నివాసంలో ఆదివారం వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో అవార్డు ను అబేకు ప్రదానం చేస్తున్నట్లు నేతాజీ రీసెర్చ్ బ్యూరో తెలిపింది. 
 
అయితే ఈ అవార్డును కోల్‌కతాలోని జపాన్ కాన్సుల్ జనరల్ నకమురా యుటాకా అబే తరపున ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో భారత్‌లోని జపాన్ రాయబారి సతోషి సుజుకీ ఢిల్లీ నుంచి ప్రసంగించారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడి మనవడు, నేతాజీ రీసెర్చ్ బ్యూరో డైరెక్టర్ అయిన సుగతా బోస్, అబేను నేతాజీకి గొప్ప ఆరాధకుడిగా అభివర్ణించారు.