నేతాజీ ధైర్యం, త్యాగం, దేశభక్తికి ప్రతీక

నేతాజీ సుభాష్ చంద్రబోస్ ధైర్యం, త్యాగం మరియు దేశభక్తికి ప్రతీక అని, ఆయన తన జీవితమంతా స్వాతంత్య్రాన్ని ఆశించే భారత ప్రజల కోసం అంకితం చేశారని నేతాజీ 125వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తూ  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్‌ త్లెఇపారు.
ఇంఫాల్‌లో ఆదివారం జరిగిన విశిష్ట సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ఆర్‌ఎస్‌ఎస్ నేతాజీ జన్మదినాన్ని క్రమం తప్పకుండా జరుపుతున్నప్పటికీ, ఈ సంవత్సరం  భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75వ సంవత్సరం కావడంతో ఈ సంవత్సరం వేడుకలు చాలా ముఖ్యమని చెప్పారు. స్వాతంత్య్రం కోసమే  నేతాజీ తన జీవితాంతం త్యాగం చేశారని ఆయన గుర్తు చేశారు.
“స్వాతంత్య్రం కోసం నేతాజీ ఇంటిని విడిచి  విదేశాలకు వెళ్లి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడటానికి సైనిక (ఇండియన్ నేషనల్ ఆర్మీ) దళాన్ని స్థాపించారు. ఆయన జీవితం మనందరికీ ఆదర్శప్రాయమైన పోరాటం. నేతాజీ ఒక మహోన్నత లక్ష్యం కోసం జీవించారు” అంటూ ఆయన కొనియాడారు.
నేతాజీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సవాలు చేయడమే కాకుండా స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారని డా. భాగవత్ గుర్తు చేశారు.   కుల, మత, మతాలకు అతీతంగా భారతీయులందరినీ నేతాజీ అనుసంధానం చేశారని తెలిపారు
ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడిగా అత్యధిక మరిటీతో గెలుపొందడం ద్వారా సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా వాదనను వినిపించడానికి దేశ ప్రజలు ఆయనకు బాసటగా నిలిచినట్లు స్పష్టమైనదని చెప్పారు.  అయితే ఏదో ఒకవిధంగా ఆయన ఆ పదవి నుండి వైదొలగవలసి వచ్చిందని ఆయన విచారం వ్యక్తం చేశారు.
దేశభక్తి, దేశ ఐక్యత గురించి స్పష్టమైన ఆలోచనతో పాటు దాని కోసం సర్వం త్యాగం చేసే ధోరణిని కూడా ఆయన ప్రదర్శించారని తెలిపారు.  తన కోసం ఏమీ ఉంచుకోకుండా, దేశం కోసం ప్రతిదీ ఇచ్చారని, అలాంటిదే నేతాజీ జీవితం అని గుర్తు చేసుకున్నారు.  ఆధ్యాత్మిక ప్రేరణే  ఆయనకు స్ఫూర్తి అని, ఆ స్ఫూర్తితోనే తన మాతృభూమి అయిన భారతదేశం కోసం సర్వస్వం త్యాగం చేశానని వివరించారు.
డా. భాగవత్  నాలుగు రోజుల పర్యటన కు మణిపూర్ చేరుకున్నారు. ‘అన్‌సంగ్ ఆంగ్లో-మణిపురి వార్ హీరోస్ ఎట్ కాలాపానీ’ అనే పుస్తకాన్ని కూడా భగవత్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ్ ప్రముఖులు సునీల్ దేస్పాండే,  ఉల్హాష్ కులకర్ణి,  వశిష్ట బజుర్‌బరువా,  రాజేన్ సింగ్ , ఎంఎం అశోకన్‌తో పాటుగా యుద్ధ వీరుల కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.