తొలి మహిళా యూనివర్సిటీగా కోఠి ఉమెన్స్ కాలేజ్

వందేళ్ల ఉత్సవాలకు సిద్ధమవుతున్న కోఠి మహిళా కళాశాలను తెలంగాణాలో తొలి మహిళా యూనివర్సిటీగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. 

ఉమెన్స్ కాలేజీని మహిళా యూనివర్సిటీగా తీర్చిదిద్దే అంశంపై తన కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉండి యుజిసి స్వయం ప్రతిపత్తితో, న్యాక్ గుర్తింపు కలిగిన కోఠి మహిళా కళాశాలను, మహిళా విశ్వవిద్యాలయంగా మార్చేందుకు అన్ని అర్హతలు కలిగి ఉందని ప్రభుత్వం భావించిందని మంత్రి పేర్కొన్నారు. 

యూనివర్సిటీగా మార్చేందుకు అవసరమైన అన్ని అర్హతలు ఉన్నందునే ప్రభుత్వం విశ్వవిద్యాలయంగా మార్చాలని భావిస్తోందని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉమెన్స్ కాలేజీని యూనివర్సిటీ మారిస్తే అవసరమయ్యే బోధనా సౌకర్యాలు, విద్యార్థులకు వసతులు, మౌళిక సదుపాయాలు తదితర అంశాలపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని ఆమె కోరారు.

కోఠి మహిళా కళాశాలకు చారిత్రాత్మక వైభవం ఉండటంతో దాన్ని మహిళా విశ్వ విద్యాలయంగా మారిస్తే తెలంగాణ మహిళల ఉన్నత విద్యలో మహర్ధశ వస్తుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ప్రస్తుతం కోఠి మహిళా కళాశాలలో 4,159మంది విద్యార్థినులు చదువుతుండగా, మహిళా యూనివర్సిటీగా మారిస్తే ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆమె సూచించారు. ఈ మహిళా విశ్వవిద్యాలయంలో ఆధునిక కోర్సులు బోధించేలా కోర్సులను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.