తెలంగాణ ప్రభుత్వంకు ఎన్జీటీ నోటీసులు 

హైదరాబాద్ శివార్లలోని మైనింగ్ జోన్ లో అక్రమాలపై చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో విచారణ జరిగింది. రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లు స్వయంగా తనిఖీలు చేయాలని జస్టిస్ కే రామకృష్ణన్, డాక్టర్ కే సత్యగోపాల్ తో కూడిన ఎన్జీటీ ధర్మాసనం ఆదేశించింది.
అలాగే కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 28 వాయిదా వేసింది. అక్రమ మైనింగ్ బాధితులైన తెలంగాణకు చెందిన ఇందిరా రెడ్డి, నిఖిల్ రెడ్డి  ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు.  దీన్ని విచారించిన ధర్మాసనం…అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నదో వచ్చే విచారణలో చెప్పాలని ఆదేశించింది.
అక్రమాల మైనింగ్ కార్యక్రమాల వల్ల పర్యావరణానికి కలిగిన హానిని అంచనా వేసేందుకు సంయుక్త కమిటీని ఏర్పాటు చేసింది.  ఇందులో కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ మైనింగ్ శాఖ, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, రంగారెడ్డి, యా దాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లు ఉన్నారు. ఫిబ్రవరి 28 వరకు నివేదిక ఇవ్వాలని కమిటీని చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది.

సోమేష్ కుమార్ పై హైకోర్టు అసహనం

మరోవంక, పనిచేయించుకోకుండా జీతాలిస్తే.. ప్రజాధనం వృథా అయినట్లే అని వ్యాఖ్యానించింది హైకోర్టు. ప్రభుత్వ శాఖల్లో కొందరు ఉద్యోగులకు పోస్టింగులు ఇవ్వకపోవడంపై హైకోర్టులో విచారణ జరిగింది. విశ్రాంత ఉద్యోగి నాగధర్ సింగ్ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. 
 
పోస్టింగులు లేకుండానే జీతాలు ఇస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. కౌంటర్ దాఖలు చేయనందుకు సీఎస్ సోమేశ్ కుమార్ పై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలుచేయకుంటే.. మార్చి 14న వ్యక్తిగతంగా హాజరు కావాలని హైకోర్టు స్పష్టం చేసింది. 
 
వెయిటింగ్ ఎంత మంది ఉన్నారు… ప్రభుత్వ చర్యలేమిటో.. నివేదిక ఇవ్వాలని తెలిపింది. పిల్ పై విచారణను మార్చి 14కు వాయిదా వేసింది.