గాంధీలో 120 మంది వైద్య సిబ్బందికి కరోనా!

తెలంగాణలో మూడో వేవ్ కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా వైద్య సేవలు అందించే డాక్టర్లు కరోనా బారిన పడుతున్నారు. 

హైదరాబాదులోని గాంధీ  ఆస్పత్రిలోని వైద్య సిబ్బంది భారీ సంఖ్యలో కొవిడ్ బారిన పడినట్లు తెలుస్తోంది.  ఏకంగా 120 వైద్య సిబ్బందికి కరోనా సోకినట్లు సమాచారం. వీరిలో 40 మంది పీజీ విద్యార్థులు, 38 మంది హౌస్ సర్జన్లు, 35 మంది ఎంబీబీఎస్ డాక్టర్లు, ఆరుగురు ఫ్యాకల్టీలు ఉన్నట్లు తెలుస్తోంది. 

ఆసుపత్రిలో ప్రస్తుతం 139 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు చెప్పారు. వీరిలో 35 మంది గర్భిణులు కూడా ఉన్నారని వెల్లడించారు. కరోనా సోకిన వైద్య సిబ్బందిని ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచి వైద్యం అందించనున్నట్లు సూపరింటెండెంట్ తెలిపారు. 

అలాగే ఉస్మానియా ఆసుపత్రిలో తాజాగా 20 మంది నర్సులు కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే 79 మంది వైద్యులు, సిబ్బందికి కరోనా సోకగా, వారు ఐసోలేషన్‌లో ఉన్నారు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో మిగతా వైద్యులు, సిబ్బందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఒక్కసారిగా ఈ స్థాయిలో డాక్టర్లు కరోనా బారిన పడటంతో ఇతర సిబ్బందిలో తీవ్ర ఆందోళన మొదలైంది. మరికొందరు సిబ్బందికి చెందిన కరోనా  రిపోర్టులు రావాల్సి ఉంది. కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం

మరోవంక ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో కూడా కరోనా కలకలం సృష్టిస్తోంది. 57 మంది రోగులకు కరోనా  సోకింది. వీరితో పాటు 9 మంది వైద్య సిబ్బంది కూడా వైరస్ బారినపడ్డారు. లక్షణాలు ఉన్న వారందరికీ ఆస్పత్రి అధికారులు టెస్టులు చేయిస్తున్నారు. 

మానసిక రోగులు కావడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లక్షణాలు తీవ్రంగా ఉన్నవారిని ఐసోలేషన్లో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఉమాశంకర్ చెప్పారు. 

సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 80,138 టెస్టులు నిర్వహించగా  2,447 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. గత 24గంటల్లో 2,295మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. వైరస్ కారణంగా ముగ్గురు చనిపోయారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 0.57 శాతంగా ఉండగా,  రికవరీ రేటు 96.31శాతంగా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 22,197 యాక్టివ్ కేసులున్నాయి.

జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఈ రోజు జీహెచ్ఎంసీలో 1112 మందికి కరోనా నిర్థారణ అయింది. మేడ్చల్ మల్కాజ్గిరిలో 235, రంగారెడ్డిలో 183, హనుమకొండలో 80 మంది చొప్పున కరోనా  బారిన పడ్డారు.

రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని ఉన్నతవిద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వైద్య కశాలలకు మినహా విద్యా సంస్థలన్నింటికీ సెలవులు పొడిగించిన నేపథ్యంలో పరీక్షలన్నీ వాయిదా వేయాలని రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది. ఈ నెల 30 వరకు ప్రాక్టికల్స్, రాత, మిడ్ పరీక్షలన్నీ వాయిదా వేయాలని వర్సిటీలకు ఉన్నతావిద్యామండలి తెలిపింది. ఉన్నత విద్యా మండలి ఆదేశాల మేరకు అన్ని యూనివర్సిటీలు తమ పరిధిలోని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి.

ఉస్మానియా, జెఎన్‌టియుహెచ్, శాతవాహన, అంబేడ్కర్ యూనివర్సిటీలు వివిధ పరీక్షలను వాయిదా వేశాయి. మళ్లీ పరీక్షలు నిర్వహించే తేదీలను తర్వాత ప్రకటించనున్నట్లు వర్సిటీలు వెల్లడించాయి. సెలవుల్లో పరీక్షలను నిర్వహిస్తే.. వాటిని పరిగణనలోకి తీసుకోబోమని ప్రైవేట్ కళాశాలలకు జెఎన్‌టియుహెచ్ స్పష్టం చేసింది. ఉస్మానియా, జెఎన్‌టియుహెచ్ వర్సిటీలు ఆన్‌లైన్‌లో బోధన కొనసాగిస్తున్నాయి.

హైకోర్టు ఆదేశాలు 
 
ఇలా ఉండగా, కరోనా కేసులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యం లో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో ఆదేశించిన మేరకు ఆర్‌టీపీసీఆర్‌ పరీ క్షలను పెంచాలని, రోజుకు లక్ష పరీక్షలు నిర్వ హించాలని తేల్చిచెప్పింది. 
 
ప్రజలు గుమిగూడ కుండా చూడాలని, ప్రజలు భౌతికదూరం పాటించేలా, మాస్క్‌ను తప్పనిసరిగా ధరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు తీసుకున్న చర్యలను వివరిస్తూ ఈనెల 24లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావలిలతో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 
 
రోజుకు తప్పసరిగా లక్ష కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని గతంలో ధర్మాసనం ఆదేశించిందని, అయితే అప్పుడప్పుడు మినహా రోజుకు 50 వేలకు మించి పరీక్షలు చేయడం లేదని పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచందర్‌ నివేదించారు.