విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ పై కొత్త చట్టం

రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూల్లు, జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ, వచ్చేవిద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం లో విద్యా బోధనకై కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ రెండు అంశాల పై పూర్తి అధ్యయనం చేసి  సంబంధిత విధి విధానాలను రూపొందించేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన…మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి , పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కేటిఆర్ లు ఈ సబ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
రానున్న శాసన సభా సమావేశాల్లో దీనికి సంబంధించిన నూతన చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది.రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ. 7289 కోట్ల తో …‘‘ మన ఊరు – మన బడి ’’ ప్రణాళిక  కోసం కేబినెట్ ఆమోదం తెలిపింది.
కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం  ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. నర్సంపేటలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు సీఎం వెంట వెళ్లనున్నారు. 
 
ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా పలు జిల్లాల్లో పంట దెబ్బతింది. ఈ అంశంపై కేబినెట్లో చర్చించిన సీఎం కేసీఆర్.. తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. కొన్ని జిల్లాల్లో రైతులు ఇప్పటికీ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తున్న విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. దీంతో కొనుగోళ్లు పూర్తయ్యే వరకు కేంద్రాలను కొనసాగించాలని సీఎం అధికారులను ఆదేశించారు.