
భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకుఇది మంచి సమయమని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. సోమవారం నుండి ఆన్‌లైన్‌లో ప్రారంభమైన ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఇఎఫ్) సమావేశాల్లో ప్రధాని ప్రసంగిస్తూ భారతీయులకు గల వ్యాపార స్ఫూర్తి, కొత్త సాంకేతికతను అందిపుచ్చుకునే సామర్ధ్యం, మన అంతర్జాతీయ భాగస్వాములందరికీ నూతన ఊత్సాహాన్ని, ప్రేరణను ఇస్తుందని తెలిపారు.
2014లో భారత్‌లో కొద్ది వందల్లోనే స్టార్టప్‌లు రిజిస్టర్ అయ్యాయి. కానీ ఈనాడు, వాటి సంఖ్య ఏకంగా 60వేలు దాటింది. గత ఆరు మాసాల్లో పదివేలకు పైగా నమోదయ్యాయని ప్రధాని చెప్పారు. ఈనాడు దేశంలో 50లక్షలకుపైగా సాఫ్ట్‌వేర్ డెవలపర్లు పని చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఈనాడు భారత్, ప్రపంచంలోనే అతి పెద్ద పెద్దదైన, సురక్షితమైన, విజయవంతమైన డిజిటల్ చెల్లింపుల వేదికగా వుందని ప్రధాని తెలిపారు. గత నెల్లోనే ఏకంగా రూ 440కోట్ల లావాదేవీలను యుపిఐ ద్వారా జరిపిందని చెప్పారు. ప్రస్తుతం కోవిడ్ మహమ్మారి అందరినీ వణికిస్తున్న వేళ కోట్లాదిమంది ప్రజలకు విజయవంతంగా వ్యాక్సిన్లు పూర్తి చేశామని ప్రధాని గుర్తు చేశారు.
ప్రజాస్వామ్యంపై భారత్‌కు గల చెక్కుచెదరని నమ్మకం, భారతీయుల నైపుణ్యాలు, వారి స్వభావాలతో 21వ శతాబ్దాన్ని శక్తివంతం చేసే సాంకేతికత గురించి ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ ఏడాది భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటోంది. అదే సమయంలో 156 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సిన్ వేయడం పూర్తిచేశామని ప్రధాని తెలిపారు.
వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించాలంటే జీవన శైలిలో మార్పులు ఏ రీతిన చేసుకోవాలో ఆయన వివరిస్తూ ఏ వస్తువునైనా వాడి పారేసే సంస్కృతి ప్రస్తుతం పెచ్చరిల్లుతోందని, ఈ ధోరణి, వినిమయంతత్వం వల్ల వాతావరణ మార్పులకు సంబంధించిన సవాళ్ళు మరింత తీవ్రమవుతాయని మోదీ హెచ్చరించారు.
ప్రపంచవ్యాప్తంగా మానవాళికి మంచి జరగాలనే మన లక్ష్యాన్నీ నెరవేర్చుకోవాలంటే 2070కల్లా కర్బన ఉద్గారాలను పూర్తిగా తగ్గించాల్సివుందని, ఇందుకు తాము కట్టుబడి వున్నామని ప్రధాని వెల్లడించారు. భారతదేశ పురోగతి అంతా పచ్చదనం, పరిశుభ్రత, సుస్థిరతలతో కూడినదిగా, విశ్వసనీయమైనదిగా వుంటుందని ఆయన స్పష్టం చేశారు. సుస్థిర అభివృద్ధి కోసం తాము చేసే కృషి వంద శాతమూ వుంటుందని చెప్పారు.
కరోనా మహమ్మారి సమయంలో కూడా ప్రపంచ దేశాలకుభారత్ అందించిన సేవలను ఆయన వివరించారు. బహుళ భాషలు, సంస్కృతులతో కూడిన ఈ దేశ వాతావరణం తమ బలమే కాదని, యావత్ ప్రపంచ బలమని మోదీ పేర్కొన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా, 80 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉచితంగా ఆహారం అందించగలిగామని చెప్పారు.
ఈనాడు భారత్, ప్రపంచంలోకెల్లా మూడవ అతిపెద్ద ఫార్మా ఉత్పత్తిదారుగా వుందని ప్రధాని గుర్తు చేశారు. పలు దేశాలకు ముఖ్యమైన మందులు, వ్యాక్సిన్లు అందచేయడం ద్వారా ”వన్ ఎర్త్, వన్ హెల్త్’ అనే దార్శనికతను భారత్ ఏ రీతిన అనుసరించిందో మనం చూశామని చెప్పారు. దేశంలో సుమారు 50 లక్షల మంది సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ ఉన్నారని, ప్రపంచంలోని పలుదేశాల్లో భారతీయ నిపుణులు సేవలనందిస్తున్నారని తెలిపారు.
భారత్ ప్రపంచంలో మూడో అత్యధిక యూనికార్న్స్ (100 కోట్ల డాలర్ల విలువైన స్టార్టప్ కంపెనీ) ఉన్న దేశమని, గత ఆరునెలల్లోనే 10వేలకు పైగా కొత్త స్టార్టప్స్ రిజిస్టరయ్యాయని మోదీ తెలిపారు. భారత యువత వ్యవస్థాపక స్ఫూర్తితో పాటు సరికొత్త ఆవిష్కరణలు చేయడంలో, కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందంజలో ఉందన్నారు.
More Stories
రూ. 1 లక్ష కోట్లతో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తొలి బడ్జెట్
నాపై సెటైర్లు వేయడానికి కమ్రా సుపారి తీసుకున్నట్లుంది
కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకునే అవకాశం!