సిఐడిపై హైకోర్టును ఆశ్రయించిన రఘురామరాజు

దేశద్రోహంతో పాటు ఐపీసీలోని సెక్షన్‌ 153(ఏ), 505, 120బీ కింద సీఐడీ పోలీసులు సుమోటోగా తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తుతో పాటు తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదలచేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు.
ఎఫ్‌ఐఆర్‌లోని వివరాలు పరిశీలిస్తే.. సీఎంను వ్యక్తిగతంగా, ఫలానా సామాజికవర్గానికి వ్యతిరేకంగా మాత్రమే వ్యవహరించానని పేర్కొన్నారు. నా వ్యాఖ్యలు కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే లా ఉన్నాయని ఎక్కడా పేర్కొనలేదని స్పష్టం చేశారు.
వాక్‌ స్వాతంత్య్రం, భావవ్యక్తీకరణ ప్రాథమిక హక్కు. ఈ నేపథ్యంలో పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ చెల్లుబాటు కాదని తెలిపారు. “స్థానిక శాసనసభ్యులతోపాటు మరికొందరు నియోజకవర్గంలోకి రాకుండా అడ్డుకుంటామని శపథం చేశారు. దీంతో మా అమ్మమ్మ అంత్యక్రియలకు సైతం హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో నియోజకవర్గానికి వస్తున్నానని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌, ఎస్పీకి ఈ నెల 10, 11 తేదీల్లో ఫోన్‌ ద్వారా తెలియజేశాను’ అని పేర్కొన్నారు.
ఈ నెల 11న ఉదయం తొమ్మిది గంటలకు అకస్మాత్తుగా పోలీసులు ఇంటికి వచ్చి మంగళగిరి సీఐడీ పోలీసుల ముందు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారని చెప్పారు. ముఖ్యమంత్రి రాజకీయ ప్రత్యర్థులపై సీఐడీ ఏడీజీ పలు తప్పుడు కేసులు నమో దు చేస్తున్నారని  రఘురామ పిటిషన్‌లో ఆరోపించారు.
అలాగే, అనారోగ్యం కారణంగా విచారణకు రాలేకపోతున్నానని రఘురామకృష్ణరాజు సీఐడీ పోలీసులకు లేఖ రాశారు.  కేసు విచారణ ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉన్నందున నాలుగు వారాలు గడువు కావాలని విజ్ఞప్తి చేశారు.
సిబిఐ కేసు విచారణ ప్రారంభం 
 
మరోవంక, ఆర్థిక సంస్థలను మోసం చేశారంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు, ఆయనకు చెందిన కంపెనీలపై సీబీఐ నమోదు చేసిన కేసు విచారణ ప్రారంభమైంది. రూ.947.71 కోట్ల మేరకు మోసం చేశారని గతేడాది డిసెంబరు 31న ఈ కేసులో సీబీఐ అధికారులు చార్జిషీటు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 
 
సోమవారం ఢిల్లీలోని రౌజ్‌ అవెన్యూ కోర్టులో సీబీఐ ప్రత్యేక జడ్జి వినోద్‌ యాదవ్‌ ఈ కేసును విచారించారు. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటును పరిశీలించారు. తదుపరి విచారణను వచ్చే నెల 16కు వాయిదా వేశారు. 
 
ఈ కేసులో 16 మంది నిందితులుగా ఉన్నారు. వీరిలో ఇంద్‌ భారత్‌ పవర్‌ మద్రాస్‌ లిమిటెడ్‌ ఏ1గా ఉండగా.. ఆ సంస్థ చైర్మన్‌, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏ2గా ఉన్నారు. సంస్థ డైరెక్టర్‌ మధుసూదనరెడ్డిని ఏ3గా, రఘురామకే చెందిన మరిన్ని కంపెనీలు ఉన్నాయి.
కాగా, తమిళనాడులోని తూత్తుకూడిలో విత్యుత్‌ప్లాంట్‌ నిర్మాణానికి పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌, ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ నుంచి రూ.947.71 కోట్లు రుణాలు తీసుకున్నారని చార్జిషీట్‌లో సీబీఐ పేర్కొంది. ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోవడమే కాకుండా రుణ ఒప్పందంలో పేర్కొన్న షరతులను పాటించలేదని వివరించింది.
ఈ రుణ మొతాన్ని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యుకో బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ల కోసం మళ్లించడంతో పాటు కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు చెల్లించినట్లు సీబీఐ పేర్కొంది. ఆ తర్వాత రుణాలు చెల్లించకపోవడంతో ఈ డిపాజిట్లను రుణాలకు సర్దుబాటు చేసినా బ్యాంకులకు నష్టం వాటిల్లిందని చార్జిషీట్‌లో సీబీఐ  వివరించింది.