చంద్రబాబు, దేవినేని ఉమాలకు కరోనా పాజిటివ్

మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడికి కరోనా పాజిటివ్ గా తేలింది. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నట్లు తెలిపారు. కరోనా నిర్ధరణ కావడంతో ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు ట్వీట్  చేశారు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 
 
ఉండవల్లిలోని  తన నివాసంలో చంద్రబాబు హోంఐసోలేషన్ లో ఉన్నారు. ఇటీవల కాలంలో తనకు సన్నిహితంగా ఉన్నవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.  మరోవైపు చంద్రబాబు కుమారుడు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కు నిన్నకరోనా  నిర్ధరణ అయ్యింది. 
 
మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర్‌రావు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని దేవినేని ట్విట్టర్ వేదికగా నిర్ధారించారు. ‘‘నేను కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. డాక్టర్ల సలహా మేరకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను’’ అంటూ దేవినేని ఉమా ట్వీట్ చేశారు.
కడపలోని రిమ్స్‌లో సోమవారం కరోనా వైరస్‌ కలకలం రేపింది. ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌కు చెందిన 48 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌ పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో రిమ్స్‌ అధికారులు 146 మంది విద్యార్థులకు కరోనా టెస్ట్‌లు చేశారు.

విజయవాడ ప్రభుత్వ ఆస్స‌త్రిలో కరోనా కలకలం రేపుతోంది. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రవికిరణ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఆయనతో పాటు మరో 25 మంది జూనియర్ డాక్టర్లు, ఇతర వైద్యులకు పాజిటివ్ అని తేలింది. అలాగే పారామెడికల్ సిబ్బంది కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో ప్రభుత్వాస్పత్రిలో మొత్తం 50 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇంత మంది వైద్యులు కరోనా బారిన పడటంతో ఆస్పత్రిలో మిగిలిన వైద్యులు, రోగులు ఆందోళన చెందుతున్నారు.

కాగా, రాత్రి కర్ఫ్యూ విధిస్తూ గత వారం రాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన మంగళవారం (18వ తేదీ) నుంచి ఈ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఈ నెల 31 వరకూ ఇవి అమలులో ఉంటాయి. రోజూ రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 వరకు కర్ఫ్యూ ఉంటుంది.   

కర్ఫ్యూ నుంచి ఆసుపత్రులు, మెడికల్‌ ల్యాబ్‌లు, ఫార్మసీ రంగాలతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా, టెలీ కమ్యూనికేషన్లు, ఇంటర్నెట్‌ సర్వీసులు, ప్రసార సేవలు, ఐటీ, ఐటీ సంబంధిత సేవలు, పెట్రోల్‌ బంకులు, విద్యుత్, నీటి సరఫరా, పారిశుధ్య సిబ్బందికి మినహాయింపు ఉంటుంది. 

అదే విధంగా అత్యవసర విధుల్లో ఉండే న్యాయాధికారులు, కోర్టు సిబ్బంది, స్థానిక సంస్థలకు చెందిన సిబ్బందిని కూడా ఈ ఆంక్షల నుంచి మినహాయించారు. అయితే.. వారు విధి నిర్వహణలో గుర్తింపు కార్డును చూపాల్సి ఉంటుంది.  వీరితో పాటు గర్భిణులు, చికిత్స పొందుతున్న పేషెంట్లు.. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల నుంచి రాకపోకలు కొనసాగించే వారు సంబంధిత ఆధారాలు, ప్రయాణ టికెట్లు చూపటం ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. అంతర్రాష్ట్ర, రాష్ట్ర సరుకు రవాణా వాహనాలకు కూడా కర్ఫ్యూ నుండి మినహాయింపు ఉంది.