నారా లోకేష్‌కు కరోనా పాజిటివ్

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. నేడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం తాను కోలుకునే వరకూ సెల్ఫ్ ఐసోలేట్ అవుతానని వెల్లడించారు. 
 
‘‘నాకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నాకు కరోనా లక్షణాలేమీ లేవు. అలాగే బాగానే ఉన్నాను. కానీ నేను కోలుకునే వరకూ సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటాను. నన్ను కలిసిన వారంతా వెంటనే టెస్టులు చేయించుకుని.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరినీ సేఫ్‌గా ఉండాలని అర్థిస్తున్నాను’’ అని నారా లోకేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
కరోనాపై జగన్ సమీక్ష 
 
ఇలా ఉండగా,   కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో కరోనా పరిస్థితులను సీఎంకు అధికారులు వివరించారు. అన్ని జిల్లాల్లో కలిపి 53,184 వేల పడకలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. 
 
ఆస్పత్రుల్లో ఆక్సిజన్ లభ్యతను మరింతగా పెంచాలని ముఖ్యమంత్రి  ఆదేశించారు. ప్రికాషన్ డోస్ సమయాన్ని 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించాలని ఈ మేరకు కేంద్రానికి లేఖ రాయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. 104 కాల్‌సెంటర్‌ పటిష్టంగా పనిచేయాలని, టెలిమెడిసిన్‌ ద్వారా కాల్‌చేసిన వారికి వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీపై పూర్తి వివరాలు తెలిపేలా విలేజ్, వార్డ్‌ క్లినిక్స్‌.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో హోర్డింగ్‌ పెట్టాలని జగన్‌ సూచించారు.
 
కాగా, రాష్ట్రంలో 27 వేలకు కరోనా యాక్టివ్‌ కేసులు చేరాయి. కరోనా బాధితుల్లో 1100 మందికి పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 60 శాతానికి పైగా ఆక్సిజన్‌పై చికిత్స తీసుకుంటున్నారంటూ సీఎం జగన్ కొవిడ్‌ రివ్యూలో తెలిపారని చెబుతున్నారు. భారీ స్థాయిలో ఆక్సిజన్‌ బెడ్స్‌ వాడకంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 
 
రాష్ట్రంలో కరోనా వైరస్‌ వేగం పెంచింది. 9,525 మందికి కొవిడ్‌ పాజటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం వెల్లడించింది. ఈ రెండు రోజుల్లో పాజిటివిటీ రేటు ఆందోళనకర స్థాయిలో 14.49 శాతంగా నమోదైంది. 
 
పండుగ నేపథ్యంలో షాపింగ్‌లు, ఇతర కార్యక్రమాలు కేసులు పెరగడానికి ఆజ్యం పోశాయి. ఈనెల 18వ తేదీ నుంచి రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ అమలులోకి రానుంది. రాత్రి 11 గంటల నుంచి మర్నాడు ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. వాస్తవానికి రాత్రి కర్ఫ్యూ విధిస్తూ ఈ నెల 11నే ప్రభుత్వం జీవో జారీ చేసింది. కానీ.. సంక్రాంతి నేపథ్యంలో అమలును 18కి వాయిదావేసింది.