ఫిరోజ్‌పూర్‌ ఎస్‌ఎస్‌పి పై బదిలీ వేటు

మూడు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ  కాన్వారు భద్రతా వైఫల్యానికి సంబంధించి పంజాబ్‌ పోలీసు అధికారులపై వేటు పడింది. ఫిరోజ్‌పూర్‌ సీనియర్‌ పోలీసు సూపరింటెండెంట్‌ (ఎస్‌ఎస్‌పి) హర్మాన్‌దీప్‌ సింగ్‌ హన్స్‌తో సహా ఏడుగురు ఐపిఎస్‌ అధికారులను, ఇద్దరు పిపిఎస్‌ అధికారులను బదిలీ చేశారు. 
 
ఈ మేరకు పంజాబ్‌ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిరోజ్‌పూర్‌ పోలీసుల వ్యవహార శైలి వివాదాస్పదమైన నేపథ్యంలో ఈ చర్యలు వెలువడ్డాయి. తాజాగా ఫిరోజ్‌పూర్‌ ఎస్‌ఎస్‌పిగా నరేంద్ర భార్గవను నియమించారు.. ఇతర పోస్టింగ్‌ల్లో జోనల్‌ కమిషనర్ల నుండి పంజాబ్‌ ప్రభుత్వం అదనపు చార్జ్‌లను ఉపసంహరించుకుంది.
ప్రధాన మంత్రి ప్రయాణ మార్గం గురించిన సమాచారాన్ని తమకు హర్మాన్‌దీప్‌ సింగ్‌ హన్స్‌   అందించారని స్వయంగా నిరసన ప్రదర్శనలు చేసిన రైతు నాయకులు తెలపడం గమనార్హం. ప్రధాని పర్యటన సమాచారం `లీక్’ కావడంతో పెద్ద భద్రతా లోపంగా కేంద్రం భావిస్తున్నది. 
 
మరోవంక,  పంజాబ్ నూతన పోలీసు డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపిఎస్ అధికారి వీరేష్ కుమార్ భావ్రా శనివారం నియమితులయ్యారు. పంజాబ్‌తోసహా ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి కొద్ది గంటల ముందు ఈ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయి. 
 
పంజాబ్ హోం గార్డు డిజిసిగా పనిచేసిన భావ్రా ప్రస్తుత డిజిపి సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ స్థానంలో నియమితులయ్యారు. యుపిఎస్‌సి ఎంపిక చేసిన ముగ్గురు అధికారుల పేర్లతో కూడిన జాబితా నుంచి 1987 బ్యాచ్‌కు చెందిన ఐపిఎస్ అధికారి భావ్రాను చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రభుత్వం డిజిపిగా ఎంపిక చేసింది.
 
రెండు నెలల్లో ముగ్గురు డీజీపీలు మారడం గమనార్హం. చటోపాధ్యాయకు డిజిపిగా నియమితులు కావడానికి నిబంధనలు అడ్డుగా ఉన్నప్పటికీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దు పట్టుబట్టడంతో, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సిఫార్సుతో గత్యంతరం లేక ముఖ్యమంత్రి ఇన్ ఛార్జ్ డిజిపిగా నియమించ వలసి వచ్చింది.