కరోనా నిబంధనలు పాటించని పక్షంలో లాక్‌డౌన్‌

కరోనా వైరస్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి తీవ్రం కావడంతో కోవిడ్‌ నిబంధనలు పాటించని పక్షంలో లాక్‌డౌన్‌ అమలు చేయక తప్పదని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ టోపే స్పష్టం చేశారు.  ఇప్పటికైన మించిపోయిందేమి లేదని, లాక్‌డౌన్‌ వద్దనుకుంటే కరోనా నియమాలు కచ్చితంగా పాటించాల్సిందేనని ఆయన విజ్ఞప్తి చేశారు.  లేని పక్షంలో ఆంక్షలు మరింత కఠినం చేయాల్సి వస్తుందని మంత్రి తేల్చి చెప్పారు. 
ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగడంవల్లే కేసులు పెరుగుతున్నాయని పెరుగుతూ  దేశంలో గడిచిన ఎనిమిది రోజుల్లో 1.17 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, అందులో ఒక్క మహరాష్ట్రలోనే 36 వేల కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. ముందుజాగ్రత్తగా చర్యగా ఇప్పటి నుంచి కరోనా  నిబంధనలు కచ్చితంగా పాటించాలని ప్రజలకు సూచించారు.
జనాలరద్దీని తగ్గిస్తే కేసులు అదుపులోకి వస్తాయని పేర్కొంటూ  రాష్ట్రంలో సినిమా థియేటర్లు, నాట్యగృహాలు, ఆలయాలు మూసివేత విషయంపై ఇంకా ఓ నిర్ణయాని కి రాలేదని,  చెప్పారు. అనేక జిల్లాలో పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించామని తెలిపారు.
 ముంబైలోని ధారావిలో ఇటీవలే వేయి రూపాయలకే నకిలీ యూనివర్సల్‌ పాస్‌ జారీచేసే ముఠాను పట్టుకుని వారిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. తాజా పరిస్థితులపై ప్రతీరోజు ఉదయం ఫోన్‌లో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ చర్చిస్తున్నారని మంత్రి టోపే తెలిపారు.
రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించాలా..? వద్దా..? లేక ఆంక్షలు మరింత కఠినం చేయాలా..? అనే దానిపై తుది నిర్ణయం ముఖ్యమంత్రి  తీసుకుంటారని చెప్పారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ను నియంత్రించడానికి కరోనా టీకాలను మరింత వేగవంతం చేయాలని సూచనలు జారీ చేశామని పేర్కొన్నారు. ఈ నెల పదో తేదీ తర్వాత బూస్టర్‌ డోసు తీసుకోవాలని రాష్ట్ర ప్రజలకు సూచించారు. ప్రజలు టీకా తప్పనిసరి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.