పార్లమెంట్ లో 402 మందికి కరోనా కలకలం

 కరోనా, ఒమిక్రాన్ కేసులు క్రమక్రమంగా విస్తరిస్తున్నాయి. ఓ పక్క కరోనా కేసులు.. మరోపక్క ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దాంతో ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూ, వారాంతరం కర్ఫ్యూలు అమలు చేస్తున్నారు.
అయినా కూడా కరోనా, ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా పార్లమెంట్ లో కరోనా కేసులు బయటపడ్డాయి. పార్లమెంట్ లో పనిచేసే 402 మందికి కరోనా సోకింది. మొత్తం 1,409 మంది సిబ్బందికి పరీక్షలు నిర్వహిస్తే.. వారిలో 402 మంది స్టాఫ్‎కి పాజిటివ్‎గా నిర్ధారణ అయినట్లు అధికారులు ప్రకటించారు. పాజిటివ్ బారినపడిన వారిని సరైన ప్రికాషన్స్ తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. 
పాజిటివ్ వచ్చిన వారిలో 200 మంది లోక్‎సభ సిబ్బంది ఉంటే.. 69 మంది రాజ్యసభ సిబ్బంది ఉన్నారు. మిగతా 133 మంది సిబ్బంది ఇతర స్టాఫ్‎గా అధికారులు గుర్తించారు. పాజిటివ్ వచ్చిన వారితో పాటు.. కాంటాక్ట్‎లను ట్రేస్ చేసి హొం ఐసోలేషన్‎కు తరలించారు.
కరోనా వ్యాప్తితో కార్యాలయాలు 50 శాతం కెపాసిటీతో రన్ చేయాలని కేంద్రప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కాగా.. ఫిబ్రవరి 1నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నిర్వహించాలని చూస్తున్నారు. అయితే ఇప్పుడు సిబ్బందికి కరోనా సోకడంతో సమావేశాలపై సందిగ్ధత నెలకొంది.
వరుణ్ గాంధీకి కరోనా 
 సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, రాజకీయ నాయకుల వరకూ భారీ సంఖ్యలో ఈ మహమ్మారి బారినపడుతున్నారు. ఇటీవల పలువురు సినిమా ప్రముఖులు, ఇద్దరు కేంద్ర మంత్రులు, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 11 మంది మహారాష్ట్ర మంత్రులు, 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, పలువురు ఎంపీలు కరోనా బారినపడ్డారు.
 
తాజాగా ఇప్పుడు యూపీ బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ఈ రోజు ఉదయం ట్విట్టర్‌‌లో వెల్లడించారు మూడ్రోజులుగా పీలీభీత్‌లో ఉన్న తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని ఎంపీ వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు. తనకు సింప్టమ్స్ తీవ్రంగా ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం మనం థర్డ్ వేవ్‌ మిడిల్‌లో ఉన్నామని, మరోవైపు ఎన్నికల ప్రచారాలు సాగుతున్నాయిని, ఈ నేపథ్యంలో ప్రికాషనరీ డోసు (బూస్టర్ డోసు) వ్యాక్సిన్‌ను ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ నేతలకు కూడా వేసేలా ఎన్నికల కమిషన్‌ ఆదేశాలివ్వాలని వరుణ్ కోరారు. యూపీ సహా ఐదు రాష్ట్రాల్లో వచ్చే నెల నుంచి ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన ఈ  సూచన చేశారు.

జార్ఖండ్ సీఎం ఇంట్లో 15 మందికి 

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంట్ సొరేన్ ఇంట్లో కరోనా కలకలం రేగింది. ఆయన భార్యతోపాటు ఇద్దరు పిల్లలు సహా మొత్తం 15 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా.. ఈ కరోనా పరీక్షల్లో సీఎం హేమంత్ సొరేన్‌కు నెగిటివ్‌గా తేలినట్లు రాంచీ మెడికల్ ఆఫీసర్ వినోద్ కుమార్ తెలిపారు. 

సీఎం నివాసంలో ఇప్పటివరకు 62 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు వినోద్ కుమార్ తెలిపారు. వారిలో 24 మంది రిపోర్టులు శనివారం సాయంత్రం వచ్చాయి. అందులో  సీఎం భార్య కల్పనా సోరెన్, వారి ఇద్దరు కుమారులు నితిన్, విశ్వజిత్, మరదలు సరళా ముర్ము, ఆయన బాడీ గార్డ్ సహా 15 మందికి పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. వారందరికీ స్వల్ప లక్షణాలు ఉండటంతో.. ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్‎లో ఉంచారు. 

మరోవైపు జార్ఖండ్ ఆరోగ్య మంత్రి బన్నా గుప్తా మరోసారి కరోనా బారిన పడ్డారు. ఆయన శనివారం పరీక్షలు చేయించుకోగా.. కరోనా పాజిటివ్‎గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన జంషెడ్‌పూర్‌లోని తన నివాసంలో ఐసోషన్‎లో ఉన్నారు.