తెలంగాణను వ్యతిరేకించిన లెఫ్ట్ కు కేసీఆర్ దావత్

కేసీఆర్ అరాచకాలు పెరిగి పోతున్నాయని ధ్వజమెత్తుతూ  తెలంగాణను వ్యతిరేకించిన సీపీఐ, సీపీఎంలకు కేసీఆర్ దావత్ ఇచ్చారని అస్సాం ముఖ్యమంత్రి, బిజెపి నేత  హిమంత బిశ్వశర్మ విస్మయం వ్యక్తం చేశారు. 317 జీవోకు వ్యతిరేకంగా వరంగల్ లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యఅతిధిగా పాల్గొంటూ ప్రధాని మోదీ దేశానికి దారి చూపారని చెప్పారు. 
 
ప్రజాబలం ముందు ధన బలం పనిచేయదని ఆయన కేసీఆర్ ను హెచ్చరించారు. ఈటల రాజేందర్ ను ఓడించడానికి రూ.500 కోట్లు ఖర్చుపెట్టారని, అయినా గెలుపును అడ్డుకోలేక పోయారని చెబుతూ, ఈటల గెలుపుతో కేసీఆర్ మైండ్ పనిచేయడం లేదని ఎద్దేవా చేశారు. 
 
కేసీఆర్ ను చూసి ఏదైనా నేర్చుకుందామని.. వచ్చా కానీ నేర్చుకోవడనాకి ఇక్కడ ఏం లేదని పేర్కొన్నారు.  యువకులు, ప్రజలు కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్నారని..పోలీసులు మాత్రమే మద్దతుగా ఉన్నారని అంటూ ధ్వజమెత్తారు. 317 జీవో ఎమోషన్ తనకు అర్థం అయ్యిందని చెప్పారు. 
 
కొడుకు ను సీఎం చేయడంపైనే కేసీఆర్ దృష్టి పెట్టారని, ప్రజలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేసీఆర్ నాటకాలు ఇక సాగవని స్పష్టం చేశారు. తెలంగాణలో 2023లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమని ధీమా వ్యక్తం చేశారు. అస్సాంలో తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. 
 
తెలంగాణ ఆదాయం రూ 9లక్షల కోట్లు కాగా, అస్సాం ఆదాయం 3లక్షల కోట్లు మాత్రమే అని చెప్పారు. కానీ కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చుకోలేదని విమర్శించారు. కేసీఆర్ కుటుంబానికి దోచి పెడుతున్నారని ఆరోపించారు. పోలీసుల మద్దతుతో కేసీఆర్ ఎన్ని రోజులు పాలిస్తారని శర్మ ప్రశ్నించారు.
బీజేపీకి భయపడే కేసీఆర్ కమ్యూనిస్టులను పిలిచి దావత్ ఇచ్చారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.  ఉద్యోగుల తరపున బీజేపీ పోరాడుతుందని చెబుతూ ఎవరూ భయపడొద్దని ఆయన అభయ మిచ్చారు. సీఎం కేసీఆర్ ను ఖచ్చితంగా జైలుకు పంపిస్తామని స్పష్టం చేసారు.  కేసీఆర్ సొరంగంలో దాక్కున్నా వదలబోమని.. జేసీబీలు పెట్టి చీల్చీ జైలుకు పంపుతామని హెచ్చరించారు.కేసీఆర్ ను ,కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.  2
2023లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.   బీజేపీ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజునే 317జీవోను చెత్తబుట్టలో వేస్తామని హామీ ఇచ్చారు. కరోనా నిబంధనలు సడలించాక 317 జీవోకు వ్యతిరేకంగా త్వరలో లక్షలాది మందితో హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడించారు. 
 
బీజేపీ పోరాటానికి కేసీఆర్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు రాష్ట్రంలో ఎవరూ మద్దతివ్వడం లేదని స్పష్టం చేశారు. అందుకే మొన్నటి వరకు వామపక్షాలను తిట్టిన కేసీఆర్ వారిని పిలిచి ప్రగతి భవన్ లో దావత్ ఇచ్చారని తెలిపారు. కేసీఆర్ చైనాకు మద్దతు ఇస్తున్నాడని, అందుకే కమ్యూనిస్టులతో మ్మక్కయ్యాడని ఆరోపించారు.
 
రాష్ట్రంలో ఇప్పటికీ 13 జిల్లాల్లో ఉద్యోగులకు జీతాలు రాలేదని చెప్పారు. ప్రధాని మోదీ తనకు ఫోన్ చేసి బీజేపీ పోరాటాన్ని మెచ్చుకున్నారని సంజయ్ చెప్పారు. కేసీఆర్ మెడలు వంచుతామని.. ఫామ్ హౌస్, ప్రగతి భవన్ ను బద్దలు కొడతామని స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు

కేసీఆర్ పాలన రాష్ట్రానికి అరిష్టంగా మారిందని బీజేపీ ఎమ్యెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ పరిస్థితి ఆరిపోయే దీపంలా మారిందని ఎద్దేవా చేశారు.  2023 వరకు కేసీఆర్ సర్కారు ఉండకపోవచ్చని, మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉంనది ఆయన జోస్యం చెప్పారు. 
 
టీఆర్ఎస్ సర్కారుకు ప్రజలు ఘోరీ కట్టడం ఖాయమని స్పష్టం చేశారు. టీఆర్ఎస్కు హుజూరాబాద్లో ఎదురైన పరిస్థితి తెలంగాణ అంతటా పునరావృతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.  రాజకీయ నాయకులతో పాటు మీడియాపై కేసీఆర్ జులుం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఎంత అణిచివేయాలని ప్రయత్నిస్తే అంతగా నిరసనలు ఎగిసిపడతాయని ఈటెల హెచ్చరించారు.
 
11న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు 
రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు,, మాజీ మంత్రి డీకే అరుణ దుయ్యబట్టారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ నేత సంజయ్ అరెస్ట్‌కు నిరసనగా ఈనెల 11న రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేస్తామని ప్రకటించారు. 
 
పాలమూరులో 317 జీవోకు వ్యతిరేకంగా ధర్నా చేస్తామని తెలిపారు. కరోనా పేరుతో బీజేపీ నిరసనలను అణిచివేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్‌ నేతల కార్యక్రమాలకు కరోనా నిబంధనలు వర్తించవా? అని ఆమె ప్రశ్నించారు. కొందరు పోలీసులు టీఆర్ఎస్‌ నేతలకు తొత్తులుగా మారారని ఆమె  ఆరోపించారు. 317 జీవోను సవరించే వరకు బీజేపీ పోరాడుతుందని డీకే అరుణ స్పష్టం చేశారు.