జిల్లా ఆస్పత్రులలో  మౌలిక వసతులు బలోపేతం చేయాలి

 
 దేశంలో కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ ప్రభావం, పెరుగుతున్న కరోనా, ఒమిక్రాన్‌ కేసులు, వైరస్‌ కట్టడికి జిల్లా ఆస్పత్రులలో  మౌలిక వసతులు బలోపేతం చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  అధికారులను ఆదేశించారు. కరోనాడ్‌ పరిస్థితులను సమీక్షించేందుకు ప్రధానమంత్రి  ఆదివారం సాయంత్రం ఉన్నతాధికారులతో సమావేశమై మారుమూల ప్రాంతాలకు టెలిమెడిసిన్ అందుబాటులో ఉంచాలని కూడా ఆదేశించారు.
 
కరోనా పరీక్షా కేంద్రాలు, ఐసీయూ, ఆక్సిజన్ బెడ్లను పెంచాలని పేర్కొన్నారు. యుద్ధ ప్రాతిపదికన వయోజనులందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని తెలిపారు. కరోనా వ్యాక్సిన్,  చికిత్సపై శాస్త్రీయ పరిశోధన మరింత సమర్థవంతంగా ముందుకు సాగాలని సూచించారు. రాష్ట్రాలలో పాటిస్తున్న ఉత్తమ పద్ధతులపై త్వరలోనే ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 
 
 ప్రజలంతా కరోనా ప్రవర్తనా నియమాలను ఖచ్చితంగా పాటించాలని తెలిపారు.  అదే విధంగా దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దివ్యాంగులు, గర్భిణులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వెసులుబాటు ఇస్తున్నట్లు వెల్లడించారు.  అలాగే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న కంటైన్‌మెంట్‌ జోన్లలోని ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి కూడా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సౌలభ్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.
 
కంటైన్‌మెంట్‌ జోన్‌ జాబితా నుంచి తొలగించాకే కార్యాలయానికి రావాలని సూచించారు.  వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జజరిగిన ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, హోం కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా, కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబాతో పాటుగా పౌరవిమానయాన కార్యదర్శి, రైల్వే బోర్డు చైర్మన్, పలు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో దేశంలో కరోనా మూడో ర్డ్‌వేవ్ ప్రభావం, పెరుగుతున్న కొవిడ్, ఒమిక్రాన్ కేసులు, వైరస్ కట్టడికి తీసుకోవలసిన చర్యలు, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడం, మెడికల్ ఆక్సిజన్, ఔషధాల నిల్వ, వైరస్ ఉధృతిని ఎదుర్కోవడానికి వివిధ శాఖల సంసిద్ధత తదితర అంశాలను చర్చించినట్లు తెలుస్తోంది. 

త్వరలో యుపి సహా అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. కాగా డిసెంబర్‌ 24న తరువాత ప్రధాని నిర్వహించిన తొలి కోవిడ్‌ సమీక్షా సమావేశం ఇది. అయితే అప్పుడు దేశంలో ఒమిక్రాన్‌ ఉనికి అప్పుడే ప్రారంభయింది. అయితే ప్రస్తుతం దేశంలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

వందలాది మంది డాక్టర్లు, ఆరోగ్య రంగ ఉద్యోగులు వైరస్‌ బారీన పడ్డారు.  సోమవారం నుంచి దేశంలో మూడో డోసు ఇవ్వడం ప్రారంభించనున్నారు. ఆరోగ్య రంగ ఉద్యోగులకు, రోగాలతో ఉన్న సీనియర్‌ సిటిజన్లకు మూడో డోసు ఇవ్వనున్నారు.

ఇదిలా ఉండగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సోమవారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో సమావేశం కానున్నారు. దేశంలో కరోనా పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలియజేశారు. చాలా రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫూ లాంటి కఠిన ఆంక్షలు విధించినప్పటికీ పూర్తిస్థాయి లాక్‌డౌన్‌కు సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ ఠాక్రే చేసిన ప్రకటనలే దీనికి తాజా ఉదాహరణ. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌పై సోమవారం జరిగే సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.