ప్రవాసుల విజయాలకు గర్విస్తున్నాం

ప్రవాసభారతీయుల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రవాసులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్దిలో ప్రవాస భారతీయుల సహకారానికి గుర్తుగా ఏటా జనవరి 9 న ప్రవాస భారత దినోత్సవం నిర్వహిస్తుంటారు. 1915 లో ఈ రోజునే మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగొచ్చి, తదనంతరం స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించడం విశేషం.
 
 ‘మన ప్రవాసులు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో రాణిస్తూ తమకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. అదే సమయంలో వారు తమ మూలాలను మరువలేదు. వారి విజయాల పట్ల మేం గర్విస్తున్నాం’ అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. 
 
భారత ప్రపంచ దృష్టి కోణానికి నిజమైన ప్రతినిధులు ప్రవాస భారతీయులేనని, దేశాభివృద్ధికి తోడ్పడేందుకు వారంతా కృషి చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం ప్రవాస భారత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్‌ఆర్‌ఐల విజయాలను అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. దేశ సాంస్కృతిక రాయబారులుగా కొనసాగాలని సూచించారు. 
 
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కొనసాగుతోన్న ప్రస్తుత తరుణంలో అభివృ్దద్దిలో భాగస్వాములు కావాలని కాంక్షించారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నారైలు తమకంటూ ప్రత్యేకతను చాటుకున్నారని, వివిధ రంగాల్లో రాణిస్తున్నారని అదే సమయంలో తమ మూలాలను మర్చిపోరాదని ఆయన సూచించారు. 
 
 ‘మీరు సాధించిన ఘనతలు మాకు గర్వకారణం. మన భావోద్వేగ బంధం మరింత బలపడుతోంది’ అని విదేశాంగమంత్రి జైశంకర్‌ ట్వీట్‌ చేశారు.