ప్రపంచ వ్యాప్తంగా 30 కోట్లు దాటిన కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 30 కోట్లు దాటాయని జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్శిటీ గణాంకాలు తెలిపాయి. అమెరికాలో కేసుల సంఖ్య 5,84,49,898కి చేరగా, మరణాలు 8,33,957కి చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కేసులు, మరణాల్లో అమెరికానే అగ్ర స్థానంలో వుంది.
 
 ప్రపంచ కేసుల్లో 19 శాతానికి పైగా, మరణాల్లో 15 శాతానికి పైగా అక్కడే నమోదయ్యాయి. గతేడాది జనవరి 26 నాటికి అంతర్జాతీయ కేసులు 10 కోట్ల మైలురాయిని చేరాయి. ఆగస్టు 4 నాటికి 20 కోట్లకు చేరాయి. ప్రస్తుతం 30 కోట్లు దాటాయి.
 
ప్రస్తుతమిస్తున్న వ్యాక్సిన్లు అన్ని రకాల వేరియంట్లకు సమర్ధవంతంగానే పనిచేస్తున్నాయని, ఆస్పత్రుల్లో చేరడాన్ని, మరణాల తీవ్రతను అరికట్టగలుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు మరియా వాన్‌ కెకొవ్‌ తెలిపారు.  తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలన్నది అత్యంత ప్రాధాన్యత గల అంశంగా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సి వుందని తెలిపారు. 

ఒమిక్రాన్‌ విజృంభించడంతో బ్రిటన్‌లో ప్రస్తుతం పరిస్థితి దారుణంగా వుంది. ఆస్పత్రుల్లో రోగుల అవసరాలు చూసుకునే సిబ్బందికి కొరత ఏర్పడడంతో ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. రాబోయే మూడు వారాల కోసం ఆస్పత్రుల్లో పనిచేసేందుకు దాదాపు 200 మంది సైనికులను మోహరించినట్లు రక్షణ మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. 
 
ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బందికే కోవిడ్‌ రావడం లేదా సెల్ఫ్‌ ఐసొలేషన్‌లో వుండడం వంటి కారణాల వల్ల ఈ కొరత ఏర్పడింది. మొత్తంగా లండన్‌లో ఒమిక్రాన్‌ ఎక్కువగా ఉండటంతో, సైనికుల సేవలను అక్కడ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వైద్య సిబ్బంది తమ పరిమితులను దాటి వైద్య సేవలు అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
 మరోపక్క అంబులెన్సుల కొరత తీవ్రంగా ఉంది. లండన్‌లో లక్షలాదిమంది చికిత్స కోసం వేచి చూస్తున్నట్లు క్రాస్‌ పార్టీ హెల్త్‌ అండ్‌ సోషల్‌ కేర్‌ కమిటీ తెలియజేసింది. గురువారం బ్రిటన్‌లో లక్షా 94వేల కేసులు నమోదయ్యాయి. దీంతో గత వారం రోజుల్లో ఆ దేశంలో మొత్తంగా కేసులు 11లక్షలు దాటాయి. 

ఒమిక్రాన్ ప్రాణాంతకమే

ఇలా ఉండగా,  కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్రమైనది కాదంటూ జరుగుతున్న ప్రచారంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒమిక్రాన్ కారణంగా ప్రాణాలు పోతున్నాయని ప్రకటించింది. చాలా దేశాల్లో ఈ వేరియంట్ సోకినవారు ఆసుపత్రులకు వెళ్ళక తప్పని పరిస్థితి పెరుగుతోందని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ అథానోమ్ తెలిపారు. 
 
ఒమిక్రాన్ డెల్టా వేరియంట్ కన్నా వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆయన చెప్పారు. చాలా దేశాల్లో ఒమిక్రాన్ బాధితులు ఆసుపత్రుల పాలవుతున్నారని తెలిపారు. డెల్టాతో పోల్చుకుంటే ఒమిక్రాన్ తీవ్రత తక్కువగా కనిపించి ఉండవచ్చునని, మరీ ముఖ్యంగా టీకాలు వేయించుకున్నవారిలో తక్కువ తీవ్రత ఉండి ఉండవచ్చునని ఆయన పేర్కొన్నారు. 
 
అలా అయినంత మాత్రానికి దీని భావం దీనిని తేలికైనదిగా వర్గీకరించాలని కాదని ఆయన హెచ్చరించారు. గతంలో కనిపించిన కరోనా రూపాంతరాల మాదిరిగానే ఒమిక్రాన్ కూడా రోగులను ఆసుపత్రులకు వెళ్ళేలా చేస్తోందని స్పష్టం చేశారు.