ఆర్ ఎస్ ఎస్ శాఖలకు హాజరవుతున్న వారిలో 60 శాతం విద్యార్థులే

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా 55 వేల శాఖ‌లు జ‌రుగుతున్నాయ‌ని, వాటికి హాజ‌రు అయ్యేవారిలో 60 శాతం విద్యార్థులు ఉండగా, మిగిలిన 40 శాతం ఉద్యోగులు, ఇతరులు  ఉన్నార‌ని   రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్  స‌హ స‌ర్ కార్యవాహ డా. మ‌న్మోహ‌న్ వైద్య‌ తెలిపారు.
భాగ్యనగర్ లో మూడు రోజులపాటు జరిగిన సంఘ్ స్ఫూర్తి, ప్రేర‌ణ తో వివిధ రంగాల్లో ప‌నిచేస్తున్న సంస్థ‌ల ప‌దాధికారుల స‌మ‌న్వ‌య స‌మావేశాల ముగింపు సందర్భంగా శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో సమావేశాల గురించిన వివరాలు తెలిపారు.
స్వాతంత్రానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మ‌రుగున ప‌డిన 250 మంది స్వాతంత్ర స‌మ‌ర‌యోధుల చ‌రిత్ర‌ను తాము వెలికి తీయటం జరిగిందని, ఇందులో సమాజంలోని వివిధ వర్గాలతోపాటు ఎస్సీ ఎస్టీలవారు ఉన్నారని ఆయన చెప్పారు. వీటిని  సంస్కార భార‌తి నాట‌కాల రూపంలో ప్ర‌చారం చేయనున్నదని తెలిపారు. 
 
కరోనా మూలంగా సంఘ్ దైనందిక శాఖ కార్య‌క్ర‌మాలు తాత్కాలికంగా ఆగిన‌ప్ప‌టికీ, తిరిగి పూర్తి  స్థాయిలో పుంజుకొన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. యువ‌త లో సంఘ కార్య‌క్ర‌మం ప‌ట్ల ఆస‌క్తి బాగా పెరిగింద‌ని చెబుతూ 2017-21 మ‌ధ్య కాలంలో ప్ర‌తీ సంవ‌త్స‌రం ల‌క్ష‌కు పైగా యువ‌త సంఘ్ కార్య‌క్ర‌మాల్లో పాలు పంచుకొనేందుకు పేర్లు న‌మోదు చేసుకొన్నార‌ని ఆయన వెల్లడించారు. 
 
ఇక సంఘ్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా సేవా సంస్థ‌లు ఆరు వేల బ్లాక్ (మండల్) లలో  10 ల‌క్ష‌ల మందికి పైగా కార్య‌క‌ర్త‌ల‌కు కరోనాను ఎదుర్కొనే క్ర‌మంలో శిక్ష‌ణ ఇచ్చిన‌ట్లు డా. వైద్య పేర్కొన్నారు.
గ‌త ఏడాది ఆరోగ్య రంగానికి  సంబంధించి పోష‌కాహార లోపాన్ని అధిగ‌మించ‌టానికి ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించే ప్ర‌య‌త్నం జ‌రిగింద‌ని, అలాగే ఆర్థిక రంగంలో ఉపాధి క‌ల్ప‌న పై కొన్ని సంస్థ‌లు దృష్టి పెట్టాయ‌ని,  భారత్ కేంద్రిత విద్యా విధానం పై చర్చ జరిగిందని తెలిపారు.
 
సర్ సంఘ్ చాల‌క్ డాక్ట‌ర్ మోహ‌న్ భాగ‌వ‌త్, స‌ర్ కార్య‌వాహ ద‌త్తాత్రేయ హోస‌బ‌ళె లతో పాటు అయిదుగురు స‌హ స‌ర్ కార్యవాహ లు పాల్గొన్న ఈ సమావేశాలలో   36 సంస్థ‌ల‌కు చెందిన 216 మంది పాల్గొన్నారు.

ఈ స‌మావేశాలు ప్ర‌తీ సంవ‌త్సరం  సెప్టెంబ‌ర్, జ‌న‌వ‌రి నెల‌ల్లో జ‌రుగుతాయ‌ని, వివిధ రంగాల్లో ప‌నిచేస్తున్న స్వ‌యంసేవ‌క్ లు త‌మ అనుభ‌వాల‌ను, భ‌విష్య కార్య‌క్ర‌మాల‌ను ఇత‌రుల‌తో పంచుకోవ‌టం మాత్ర‌మే జ‌రుగుతుంద‌ని ఆయన చెప్పారు.  అయితే ఈ సమావేశాలలో ఎలాంటి విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకోర‌ని డా. వైద్య స్పష్టం చేశారు. స‌మాజ సంఘ‌ట‌న ద్వారా ప‌రివ‌ర్త‌న కోసం స్వ‌యంసేవ‌క్ లు కృషి చేస్తార‌ని తెలిపారు.

త‌ర్వాత విలేక‌రులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌లకు మ‌న్ మోహ‌న్ వైద్య స‌మాధానాలు ఇస్తూ  జాతీయ విద్యా విధానం భార‌తీయ చ‌రిత్ర ఆధ్యాత్మిక‌త‌ను ప్ర‌తిబింబించేట్లు ఉండాల‌ని, ఒకే విద్యా విధానం అనేది   రాష్ట్రాల భిన్న‌త్వానికి ఏమాత్రం ఆటంకం కాద‌ని ఆయ‌న వివ‌రించారు.

 
వైవిధ్యం అంటే విభేదాలు కావని, జాతి ఏకతకు అంతః సూత్రమైన అంశాలకు అనుగుణంగా ఈ విధానం ఉండాలని ఆయన సూచించారు.  కుల వివ‌క్ష‌ను రూపుమాపి, స‌మాజంలో స‌ద్భావ‌నను పెంపొందించ‌టానికి సామాజిక స‌మ‌ర‌స‌త సంస్థ కృషి చేస్తున్నామని వివరించారు. 
 
వివిధ సంస్థ‌లు త‌మ‌కు సంబంధించిన రంగాల గురించి అధ్య‌య‌నం చేసి, ప్ర‌భుత్వానికి సూచ‌న‌లు స‌ల‌హాలు అందిస్తాయ‌ని ఆయన చెప్పారు.  వాటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌టం ప్ర‌భుత్వం ప‌రిధిలోని అంశం  అని డా. వైద్య
 స్పష్టం చేశారు. 
 
 సమాజ జాగరణ అనేది సంఘ్ ప్రధాన కార్యమని, జాగృత‌ సమాజం ప్రభుత్వ విధానాలను ప్రభావం చూపుతుందని ఆయన చెప్పారు. మీడియా సమావేశంలో ఆర్ ఎస్ ఎస్ అఖిల భార‌తీయ ప్ర‌చార ప్ర‌ముఖ్  సునీల్ అంబేక‌ర్ కూడా  పాల్గొన్నారు.