ప్రధాని పంజాబ్ పర్యటన రికార్డులన్నీ భద్రపరచాలి 

ప్రధాని పంజాబ్ పర్యటన రికార్డులన్నీ భద్రపరచాలి 
ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యాలపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ఆయన పర్యటనకు సంబంధించిన ఫుటేజీలను భద్రపర్చాలని పంజాబ్, హరియాణా రిజిస్ట్రార్ జనరల్ కు ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తుపై చండీగఢ్ డైరెక్టర్ జనరల్, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అధికారి నోడల్ ఆఫీసర్లుగా వ్యవహరించాలని కోర్టు సూచించింది. 
 
సోమవారం వరకు కేంద్ర, రాష్ట్ర విచారణ  కమిటీలు దర్యాప్తు కొనసాగించాలని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. పీఎం పర్యటనలో భద్రతా లోపాలపై వస్తున్న ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణ సందర్భంగా శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది. 
ప్రధాన మంత్రి మోదీ పర్యటనకు సంబంధించిన అన్ని వివరాలతో కూడిన రికార్డులను సురక్షితంగా భద్రపరచవలసిన జవాబుదారీతనం, బాధ్యతలను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు అప్పగించింది. రిజిస్ట్రార్ జనరల్‌కు అవసరమైన సహకారాన్ని పంజాబ్ పోలీసులు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌పీజీ), ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏజెన్సీలు అందించాలని ఆదేశించింది.
అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ ప్రధాని భద్రతా విషయాన్ని పంజాబ్ సర్కారు తేలికగా తీసుకోలేదని తెలిపారు. ఘటన జరిగిన రోజే విచారణ కమిటీని ఏర్పాటు చేశామని కోర్టుకు తెలిపారు. స్వతంత్ర కమిటీతో దర్యాప్తు జరుగుతోందని అన్ని విషయాలు త్వరలో వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు.
 
కాగా, ఘటన వెనక ఉగ్రవాద హస్తాన్ని తోసిపుచ్చలేమని సొలిసిటర్ జనరల్ తుషార్ చెప్పారు. కేంద్రం కూడా కమిటీ ఏర్పాటు చేసిందని, రాష్ట్రాలకు నోటీసులు జారీ చేశామని అటార్నీ జనరల్ వేణుగోపాల్ తెలిపారు. అన్ని విషయాలు, రికార్డులు కోర్టు ఎదుట శనివారం సమర్పిస్తామని తెలిపారు.
 
కేసును సోమవారం వరకు వాయిదా వేయాలని తుషార్ మెహతా కోర్టును కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  విచారణ కొనసాగిస్తున్నాయని, కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామని పంజాబ్ అడ్వకేట్ జనరల్ చెప్పారు. దీంతో సుప్రీంకోర్టు కేసును సోమవారానికి వాయిదా వేసింది. 
 లాయర్స్ వాయిస్ అనే ప్రభుత్వేతర సంస్థ (ఎన్‌జీవో) దాఖలు చేసింది. పిటిషనర్ తరపున సీనియర్ అడ్వకేట్ మణీందర్ సింగ్ వాదనలు వినిపించారు. ఇది శాంతిభద్రతల సమస్య కాదని, ఇది స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌పీజీ) చట్టం పరిధిలోకి వస్తుందని తెలిపారు. ఇది రాష్ట్రంలో శాంతిభద్రతలకు సంబంధించిన విషయం కాదని స్పష్టం చేశారు
.
 ఎస్‌పీజీ చట్టంలోని సెక్షన్ 14ను పరిశీలించాలని కోరారు. ఎస్‌పీజీ సభ్యుని సూచనలకు అనుగుణంగా సహాయపడవలసిన కర్తవ్యం కేంద్రం, రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం, స్థానిక అధికారులకు ఉందని చెప్పారు. ఓ అవినీతి కేసులో ఓ మాజీ ప్రధాన మంత్రిపై విచారణ సందర్భంలో ఎస్‌పీజీకి సహాయపడవలసిన కర్తవ్యం, విధి గురించి గతంలో సుప్రీంకోర్టు పరిశీలనకు వచ్చిందని పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి భద్రతను ఉపసంహరించకూడదని, తనకు భద్రతను ఉపసంహరించాలని ప్రధాన మంత్రి కోరినప్పటికీ, ఆ విధంగా భద్రతను ఉపసంహరించకూడదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని వివరించారు.  ఎస్‌పీజీ చట్టం ప్రకారం ఇది రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదని, శాంతిభద్రతల అంశం కాదని, ప్రధాన మంత్రికి రక్షణ కల్పించడమనేది దేశ భద్రతకు సంబంధించిన విషయమని, ఇది పార్లమెంటు పరిధిలోకి వస్తుందని తెలిపారు.
ప్రధాన మంత్రి పంజాబ్‌లో పర్యటించినపుడు అనుమతించదగని చోట ఆయన వాహన శ్రేణిని నిలిపేశారని, ఇది చాలా తీవ్రమైన ఉల్లంఘన అని తెలిపారు. ఇలా జరగకూడదని పేర్కొన్నారు.