కేసీఆర్‌.. మీ రాక్షస పాలన అంతానికే వచ్చా  

‘కేసీఆర్‌.. మీ రాక్షస పాలన అంతానికే ఇక్కడకు వచ్చాను. మీ అవినీతి, కుటుంబ, నియంత పాలనకు వ్యతిరేకంగా బండి సంజయ్‌ నాయకత్వంలో పోరాడుతున్న మా పార్టీ నాయకులకు మద్దతు ఇవ్వడానికే వచ్చా. 2023లో బీజేపీ అధికారంలోకి రాబోతోంది. మీరు ఆపలేరు’ అని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ స్పష్టం చేశారు. 
 
 బండి సంజయ్‌ అంటే కలలో కూడా కేసీఆర్‌ భయపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణలో అవినీతి, నియంత, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా సంజయ్‌ ఆధ్వర్యంలో ధర్మయుద్ధం ఆరంభమైందనిసీనియర్ బిజెపి నేత  ప్రకటించారు. శుక్రవారం రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చిన శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. 
 
ఈ సందర్భంగా చౌహాన్‌ మాట్లాడుతూ ‘‘విపక్షాలు ప్రశ్నిస్తే సీఎం బదులివ్వాలి కానీ, కేసీఆర్‌ వారిని జైల్లో పెట్టాలనుకుంటున్నారు. జైల్లోనే పుట్టిన కృష్ణుడు కంసుడిని వధించాడు. కంసుడికి పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుంది.’’ అని హెచ్చరించారు. ‘నీలాంటి పోరాట పటిమ ఉన్న కార్యకర్తను చూసి గర్వపడుతున్నా’ అంటూ సంజయ్‌ని ప్రశంసించారు.  
‘‘ఒక అడవిలో ఓ సాధువు వద్ద ఎలుక ఉండేది.. ఓ రోజు దానిని తినడానికి వచ్చిన పిల్లి.. సాధువును చూసి భయపడి వెళ్లిపోయింది. ఇది చూసిన సాధువు తన తపశ్శక్తితో కమండలంలోని నీటిని ఎలుకపై చల్లి దానిని పిల్లిగా మార్చాడు. ఆ పిల్లి కోసం ఓ రోజు కుక్క వచ్చింది. ఇది చూసిన సాధువు ఆ పిల్లిని కుక్కగా మార్చాడు” అంటూ ఆయన కేసీఆర్ కు ఓ కదా చెప్పారు.
“తర్వాత పులి రాగా.. ఆ కుక్కను పులిగా మార్చాడు. కొద్దిరోజులు గడిచాయి. తాను మొదట ఎలుకను అని పులికి తెలుసు. సాధువు బతికి ఉంటే తనను ఎలుకగా మారుస్తాడని భావించిన పులి.. ఆయన్ను చంపాలని అనుకుంది. అది గమనించిన సాధువు దానిని ఎలుకగా మార్చాడు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా తమ కమండలాల్లోని నీటితో వచ్చే ఎన్నికల్లో ఇప్పటి పులిని ఎలుకగా మార్చాలి’’ అని శివరాజ్‌సింగ్‌ పిలుపునిచ్చారు.
‘కేసులు, అరెస్టులే మీ ఆయుధమైతే జైళ్లు, బందీఖానాలే బీజేపీ అడ్డా అవుతాయి’ అని బండి సంజయ్‌.. కేసీఆర్‌కు తేల్చిచెప్పారు. ధర్మం కోసం, న్యాయం కోసం జైలుకు వెళ్లడం తనకు కొత్త కాదని తెలిపారు. ఒక కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వనమా రాఘవను ప్రజల సమక్షంలో శిక్షించాలని సీఎం కేసీఆర్‌ను డిమాండ్‌ చేశారు. రాఘవ కాలయముడు అని సంజయ్‌ మండిపడ్డారు.
 పులి బయటకు వచ్చింది.. అంటూ సంజయ్‌ని బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ తరుణ్‌ఛుగ్‌ ప్రశంసించారు. జనరల్‌ డయ్యర్‌లా వ్యవహరించిన కరీంనగర్‌ సీపీని వదలిపెట్టబోమని హెచ్చరించారు. ప్రధాని మోదీపై, నడ్డాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మంత్రి కేటీఆర్‌ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు.
‘‘దమ్ముంటే నన్ను అరెస్టు చేయండి. బండి సంజయ్‌లా నన్ను అరెస్టు చేద్దామనుకుంటే సీఎం కేసీఆర్‌ తరం కాదు. నన్ను జైళ్లో పెట్టి చూడండి. ’’ అని బీజేపీ ఎంపీ అర్వింద్‌ సవాల్‌ విసిరారు. ‘నేను ప్రధాని మోదీ టీమ్‌లో ఎంపీని…ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి.. నరకాన్ని భూమి మీదికి తెస్తా.. ఏమనుకుంటున్నావో’’ అని హెచ్చరించారు.
 తనపై పలు పోలీస్‌ స్టేషన్లలో తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. ఒక్క ఎఫ్‌ఐఆర్‌ కూడా ఎందుకు నమోదు చేయడం లేదో డీజీపీ మహేందర్‌ రెడ్డి చెప్పాలని డిమాండ్‌ చేశారు. డీజీపీ మహేందర్‌రెడ్డికి రాజకీయాలపై సోకు ఉంటే యూనిఫాం వదిలి టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు హితవు పలికారు.