బెంగాల్‌ మాదిరిగా పాలన చేస్తే జనం తిరగబడతారు

బెంగాల్‌ మాదిరిగా తెలంగాణలో పాలన చేయాలనుకుంటే జనం తిరగబడతారని కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  బండి సంజయ్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ  తెలంగాణ ప్రభుత్వం 317 జీవోను తీసుకొచ్చి ఉద్యోగస్తులు, టీచర్లను ఇష్టమొచ్చినట్లు బదిలీలు చేస్తోందని, దానివల్ల వారు స్థానికతను కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ విషయాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యేలకు చెప్పుకున్నారని, అందులో భాగంగానే బండి సంజయ్ క్యాంప్ ఆఫీసులో జాగరణ దీక్ష చేయాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. ఉద్యోగస్తులకు అండగా ఉండాల్సిన బాధ్యత బీజేపీపై ఉందనే భావనతో దీక్ష ద్వారా నిరసన తెలపాలనుకున్నట్టు వివరించారు.
కరోనా నిబంధనలు పాటిస్తూ చేస్తున్న దీక్షను భగ్నం చేసిన పోలీసులకు మాస్క్ పెట్టుకోని మంత్రులు కనిపించలేదా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రోటోకాల్ ప్రకారం చర్యలు తీసుకోవాలనుకుంటే జైళ్లు సరిపోవని హెచ్చరించారు. బండి సంజయ్, బీజేపీ కార్యకర్తలపై ఇష్టారాజ్యంగా కేసులు పెట్టారని అంటూ  నిబంధనల ప్రకారం మీ ఎమ్మెల్యేలు, మంత్రులపై కేసులు పెట్టాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ కుటుంబానికి చట్టం వర్తించదా? టీఆర్‌ఎస్‌కు ఒక నీతి-మిగతా పార్టీలకు మరో నీతా? అని కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. ఎంపీ ఆఫీసుపై దాడి పోలీస్ వ్యవస్థకు మచ్చవంటిదన్న ఆయన పోలీసులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని, చట్టం కొందరికి చుట్టంగా ఉండకూడదని హితవు పలికారు.
ఢిల్లీలో రైతులు ఎన్ని రోజుల పాటు ఆందోళనలు చేసినా ఎప్పుడు తమ ప్రభుత్వం అడ్డుకోలేదని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. ఇష్టారాజ్యంగా హౌజ్ అరెస్టులు ఎందుకు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే విధంగా హౌస్ అరెస్ట్‌లు చేస్తే తెలంగాణ వచ్చేదా? పోలీస్ వ్యవస్థ దిగజారిపోవడం న్యాయమా? అని ప్రశ్నించారు.
 సీఎం మమతలా కేసీఆర్ చేయాలనుకుంటున్నారన్న కిషన్ రెడ్డి మనది పశ్చిమ బెంగాల్ కాదు తెలంగాణా అని గుర్తు చేశారు. రజాకారులను తరిమి తరిమి కొట్టిన చరిత్ర కలిగిన తెలంగాణ ప్రజలు అణచివేయాలనుకుంటే తిరగబడతారని ఆయన హెచ్చరించారు. బీజేపీ శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే తెలంగాణలో పోలీసులే ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు.