సంజయ్ కు నేతల పరామర్శ… నడ్డా ర్యాలీకి అనుమతి నిరాకరణ

కరీంనగర్ జిల్లా జైలులో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. ఈ రోజులు ములాఖాత్ లో కిషన్ రెడ్డితోపాటు ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తదితరులు బండిని పరామర్శించారు. జాగరణ దీక్షణ సందర్భంగా జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు.
అలాగే, బండి సంజయ్ కార్యాలయంను పరిశీలించిన నేతలు.. సంజయ్ ఇంటికి వెళ్ళి వారి కుటుంబాన్ని పరామర్శించారు. నిన్న దాడిలో గాయపడిన వారిని, జైలుకు వెళ్లిన వారి కుటుంబాలను పరామర్శించారు.
 
ముఖ్యమంత్రి కేసీఆర్ అక్రమ అరెస్టులతో బీజేపీ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తున్నారని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ తాటాకు చప్పుళ్లకు, అక్రమ కేసులకు బెదిరే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. బీజేపీ కార్యకర్తలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 
 
తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంతటి నిర్భందం, నియంతృత్వం చూడలేదని, కేసీఆర్ తీరు నిజాం పాలనను తలపిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ సమాజం, మేధావులు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్న కిషన్ రెడ్డి  తెలంగాణ సమాజం నియంతృత్వ పాలనకు చరమగీతం పాడుతుందని హెచ్చరించారు.
 
 సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే పోలీసులు కేసులు పెట్టారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆరోపించా రు. సంజయ్ అరెస్ట్‌ను నీచమైన చర్యగా అభివర్ణిస్తూ  ఉద్యోగులను ఇంత ఇబ్బంది పెట్టడం అవసరమా..? అని ఈటల ప్రశ్నించారు.  ఐపీఎస్ ఆఫీసర్ ఇలాంటి నీచమైన పని చేయవచ్చా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంగార్డు డ్యూటీ కూడా సీపీనే చేశారని విమర్శించారు. ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదని సీపీ గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు.
మరోవంక, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ సాయంత్రం హైదరాబాద్ లో సంజయ్ అరెస్ట్ కు నిరసనగా జరుపదలచిన కొవ్వోతుల ర్యాలీకి  పోలీసులు అనుమతి నిరాకరించారు.  జేపీ నడ్డా ర్యాలీకి పోలీసులు అనుమతి లేదని డీసీపీ చందన దీప్తి తెలిపారు. కరోనానిబంధనలను అందరూ పాటించాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు. కరోనా నిబంధనలు ఈనెల 10 వరకు ఉన్నాయని పేర్కొంటూ  ఈ నేపథ్యంలో తెలంగాణలో ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని ఆమె స్పష్టం చేశారు. 
 
 సికింద్రాబాద్‌లో ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీ శాంతి ర్యాలీ తలపెట్టిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌లు చేస్తున్నారు. నియోజకవర్గానికి వెళ్తోన్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావును తూప్రాన్ టోల్‌గేట్ దగ్గర మెదక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్‌ పోలీసుల అదుపులో ఉన్నారు. 

రాష్ట్ర బిజెపి కార్యాలయంలో మౌనదీక్ష

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు మౌనదీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్, జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి, ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ ఎమ్యెల్యే యెండల లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శులు ప్రేమెందర్ రెడ్డి, ప్రదీప్ రావు, రాష్ట్ర కార్యదర్శి మాధవి చౌదరి, అధికార ప్రతినిధి పాల్వాయి రజనీ, ఎస్సి మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాషా, ఆయా జిల్లాల అధ్యక్షులు, పలువురు నేతలు పాల్గొన్నారు. 
 
ఉద్యోగుల పక్షాన పోరాడిన బండి సంజయ్ పై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని మండిపడుతూ కేసీఆర్ సర్కార్ ను గద్దె దించే వరకు పోరాడుతామని నేతలు స్పష్టం చేసారు