ఏడేళ్లలో ఈశాన్య ప్రాంతం పరిస్థితి మార్చేసిన బిజెపి

భారతదేశ అభివృద్ధిలో ఈశాన్య ప్రాంతం గొప్ప పాత్ర పోషిస్తోందని పేర్కొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  . గత ప్రభుత్వాలు ఈ ప్రాంతాన్ని విస్మరించాయని విమర్శించారు.  ఫలితంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు ఇక్కడి ప్రజలు దూరమయ్యారని చెప్పారు. అయితే ఏడేళ్ల పాలనలో బిజెపి ఆ పరిస్థితిని పూర్తిగా మార్చివేసినదని ఆయన పేర్కొన్నారు.  
 
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మణిపూర్ లో మంగళవారం రూ 4,800 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మోదీ, 5 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు మణిపూర్ ప్రజలకు 2,387 మొబైల్ టవర్లను అంకితం చేశారు. 

తాను అధికారం చేపట్టకముందే ఈశాన్య ప్రాంతంలోని సామర్ధ్యాన్ని గ్రహించానని, అందుకనే తాము అధికారంలోకి రాగానే ఈ ప్రాంతపు అభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టి సారించామని ప్రధాని చెప్పారు. ఈశాన్యప్రాంతం, ముఖ్యంగా మణిపూర్ లో జరిగిన అభివృద్ధిలో గత ఏడేళ్లుగా బిజెపి ప్రభుత్వం చేస్తున్న కృషి స్పష్టంగా కనిపిస్తోందని ఆయన తెలిపారు. 

 మ‌ణిపూర్ రాష్ట్రం ఏర్పడి వచ్చే  జ‌న‌వ‌రి 21 నాటికి  50 ఏళ్లు నిండుతుందని చెబుతూ  స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా అమృత్ మహోత్సవ్‌తో పాటు ఈ సందర్భం కూడా ఒక ప్రధాన స్ఫూర్తి అని పేర్కొన్నారు.
మణిపూర్ ప్రజల ధైర్యసాహసాలకు నివాళులర్పించిన ప్రధాని, నేతాజీ సుభాష్ సైన్యం తొలిసారిగా జాతీయ జెండాను ఎగురవేసిన మొయిరాంగ్ భూమి నుంచే  అని, ఇక్కడి నుండే దేశ ప్రజల్లో స్వేచ్ఛపై విశ్వాసం ప్రారంభమైందని ప్రధాని గుర్తు చేశారు. భారత స్వాతంత్య్రానికి నేతాజీ గేట్‌వే అని పిలిచిన ఈశాన్య ప్రాంతం కొత్త భారతదేశపు కలలను నెరవేర్చడానికి గేట్‌వేగా మారుతోందని చెప్పారు. 
 
భారతదేశపు తూర్పు, ఈశాన్య ప్రాంతాలు భారతదేశ పురోగతికి మూలం కాగలవని, ఈ ప్రాంత అభివృద్ధిలో ఇది కనిపిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.  మణిపూర్ దేశానికి అరుదైన రత్నాలలో ఒకటిగా నిలిచిన రాష్ట్రమని చెబుతూ ఇక్కడి యువత, ముఖ్యంగా మణిపూర్ కుమార్తెలు ప్రపంచవ్యాప్తంగా దేశం గర్వించేలా చేశారని, ముఖ్యంగా నేడు దేశంలోని యువత మణిపూర్ క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకుంటున్నారని ప్రధాని కొనియాడారు.

భారతదేశ అభివృద్ధిలో ఈశాన్య ప్రాంతం, మణిపూర్ గొప్ప పాత్ర పోషిస్తున్నాయని చెబుతూ ఇక్కడ ప్రారంభించిన అభివృద్ధి ప్రాజెక్టులు మణిపూర్ ప్రజల జీవితాలను సులభతరం చేస్తాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మణిపూర్ అభివృద్ధి పూర్తిగా మారిపోయిందని స్పష్టం చేశారు.

 పిఎం-కిసాన్ పథకం కింద 6 లక్షల మందికి పైగా రైతులకు పరిహారం అందించామని, ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా 4 లక్షల మందికి పైగా ఉచిత వైద్య సహాయం పొందారని ఆయన గుర్తు చేశారు.  మణిపూర్‌లోని ప్రతి ఇంటికి తమ ప్రభుత్వం త్వరలో స్వచ్ఛమైన తాగునీటిని అందజేస్తుందని ప్రధాని ప్రకటించారు. 

 ‘తౌబాల్ బహుళ ప్రయోజన ప్రాజెక్ట్ నీటి ప్రసార వ్యవస్థ’తో సహా ఈరోజు ప్రారంభించిన  ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో తాగునీటి సరఫరాను అందించగలవని మోదీ  చెప్పారు. ఒకప్పుడు మణిపూర్‌లో కేవలం 6 శాతం కుటుంబాలు మాత్రమే స్వచ్ఛమైన తాగునీరు పొందేవారని, నేడు 60 శాతానికి పైగా ప్రజలు స్వచ్ఛమైన నీటిని పొందుతున్నారని, త్వరలో ఈ ప్రాంతంలో 100 శాతం సాధిస్తామని మోదీ వెల్లడించారు.